‘దేవర’ టీమ్ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బుధవారం (ఆగస్టు 16వ తేదీ) సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర’లో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.


సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ లుక్ చూసినట్లయితే... జుట్టు ముఖం మీద పడుతూ బ్లాంక్ ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్న సైఫ్ అలీ ఖాన్‌ను ఇందులో చూడవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో కొండలు, కిందన సముద్రం, అందులో పడవల్లో వెళ్తున్న కొంతమందిని చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌లో కూడా పడవల్లో ఉన్న కొంతమందిని చంపినట్లు చూపించారు. కాబట్టి ఆ గ్యాంగ్... సైఫ్ అలీ ఖాన్ మనుషులే అని అర్థం చేసుకోవచ్చు.


‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల అయిన సంవత్సరం తర్వాత దీని షూటింగ్ ప్రారంభించారు. కొరటాల పూర్తిగా బౌండ్ స్క్రిప్టు లాక్ చేశాకనే సెట్స్ పైకి వెళ్లారని సమాచారం.


కానీ ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్లాక షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆరేడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. కథానుసారం ఈ సినిమాలో బోలెడంత వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంది. అందుకే ముందుగా యాక్షన్ సన్నివేశాలన్నీ చిత్రీకరించి వీఎఫ్ఎక్స్ కంపెనీలకు అందించనున్నారు. ‘ఆక్వామ్యాన్’ లాంటి హాలీవుడ్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ విభాగంలో పని చేసిన బ్రాడ్ మిన్నిచ్ ‘దేవర’కు వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్‌గా ఉన్నారు.


ట్రాన్స్‌ఫార్మర్స్, మిషన్ ఇంపాజిబుల్ లాంటి హాలీవుడ్ సినిమాలకు స్టంట్ కోఆర్డినేటర్‌గా పని చేసిన కెన్నీ బేట్స్ ‘దేవర’ కోసం పని చేస్తున్నారు. దీంతో యాక్షన్ పరంగా కూడా ఈ సినిమా కొత్తగా ఉండనుందని అనుకోవచ్చు. ఈ సినిమాతో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ‘దేవర’కు మ్యూజిక్‌ను అందించనున్నాడు.


ఇప్పటికే దసరా లాంటి కమర్షియల్ సినిమా ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన షైన్ టామ్ చాకో కూడా దేవరలో కనిపించనున్నాడు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కలై అరసన్, చైత్ర రాయ్, మురళీ శర్మ, ‘విక్రమ్’ ఫేమ్ నరేన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘దేవర’ విడుదల కానుంది.


ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘దేవరకు’ రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలు శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్‌ను సాబు సిరిల్ చూసుకుంటున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.






Read Also : Akshay Kumar: అక్షయ్ కుమార్ ఎట్టకేలకు ఇండియన్ అయ్యాడు - ‘రిపబ్లిక్ డే’ రోజు భారత పౌరసత్వం!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial