జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలకు రైటర్‌గా చేసిన అజయ్ సామ్రాట్, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు. వచ్చే నెల(జూలై) 7న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. ఇందులో జగపతి బాబు దయ అనేది లేని దొరపాత్రలో అద్భుతంగా నటించారు. ఈ చిత్రంలో ఆయన పవర్ ఫుల్ దొర(భీమ్ రావ్) పాత్రలో కనిపించారు.
అదిరిపోయే డైలాగులతో గడగడలాడించిన జగ్గూ భాయ్!
గోల్కొండ కోట మీద సమర శంఖం పూరించే సీన్ తో ట్రైలర్ ప్రారంభం అయ్యింది. స్వాతంత్ర్య పోరాటం నాటి తెలంగాణ పరిస్థితులను ఆధారంగా ఈ చిత్రం రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. దొరల అరాచకం, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రజలు పడిన గోసను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. “పంతానికి వస్తే అంతం చూస్తా” అంటూ జగపతి బాబు చెప్పే డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచింది. విమలా రామన్ అందాలను ఒలకబోస్తూనే, అదిరిపోయే యాక్షన్ సీన్లతో అలరించింది. “దొరకు ఎదురు తిరిగిన రుద్రంగిని దమ్ దమ్ చేసి ఇడిసిపెడతా” అంటూ జగపతి బాబు కోపంతో ఊగిపోయిన సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటుంది. భర్త తన పాపాలను తగ్గించుకోవాలని చెప్పిన భార్యతో “చెప్పిందండీ, చిత్రంగా శ్రీరంగ నీతులు” అంటూ హేళన చేసే సీన్ మరింత స్పెషల్ గా నిలిచింది.
“ఒకడు ఎదరుబడి వేటాడుతాడు. ఒకడు వెంటబడి వేటాడుతాడు. నేను ఎర ఏసి వేటాడుతాను” అంటూ పవర్ ఫుల్ డైలాగులు చెప్తాడు. “మందిని దేవుడే పుట్టిస్తాడు, దేవుడే చంపేస్తాడు. ఐయాం నథింగ్ బట్ గాడ్” అంటూ ఆగ్రహంతో ఊగిపోతాడు. గతంలో ఎప్పుడూ చూడని రీతిలో జగపతి బాబు లుక్ కనిపిస్తున్నది. మొత్తంగా ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెంచుతుంది. ఈ చిత్రానికి సంతోష్ శనమోని సినిమాటోగ్రాఫర్ గా చేయగా, నాఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు.
విలన్ గా అద్భుతంగా రాణిస్తున్న జగపతిబాబు
చాలా మంది హీరోలు మొదట తమ కెరీర్ ను విలన్ పాత్రలతో మొదలు పెట్టారు. ఆ తర్వాత నెమ్మదిగా హీరోలుగా టర్న్ అయ్యారు. అలా వచ్చిన చాలా మంది ప్రస్తుతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. జగపతి బాబు విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. తొలుత హీరోగా మంచి సినిమాలు చేశారు. ఫ్యామిలీ కమ్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు ఎదురయ్యాయి. యంగ్ హీరోలతో గట్టి పోటీ ఎదురయ్యింది. దీంతో ఆయనకు అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో విలన్ పాత్రలు చేయాలి అనుకున్నాడు. తొలిసారి ‘లెజెండ్’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు. ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం అనిపించింది. గతంలో ఎప్పుడూ చూడని జగపతి బాబు ఈ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’, ‘అరవింద సమేత’ సినిమాల్లోనూ విలన్ గా నట విశ్వరూపం చూపించాడు. అటు తమిళంలోనూ పలు సనిమాల్లో విలన్ పాత్రలు చేస్తున్నాడు. మరోవైపు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు నెగెటివ్ రోల్ ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తున్నది.
Read Also: దిల్ రాజు, దర్శకుడు శంకర్‌పై మండిపడుతోన్న మెగా అభిమానులు - కారణం ఇదే
Join Us on Telegram: https://t.me/abpdesamofficial