Rudhrudu Telugu Trailer: రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘రుద్రుడు’. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ‘రుద్రుడు’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్లను ట్రైలర్‌లో చూడవచ్చు.


తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటూ, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక యువకుడి జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ‘కాంచన’లో శరత్ కుమార్ ఆత్మకు సాయం చేసే పాత్రలో లారెన్స్ కనిపించాడు. ఇందులో వీరిద్దరూ ఎదురెదురుగా హీరో, విలన్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్ ప్రియా భవాని శంకర్ అందంగా కనిపిస్తుంది.



ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాఘవ లారెన్స్ పవర్ ఫుల్ గా కనిపించారని ఆడియన్స్ సోషల్ మీడియాలో చెబుతున్నారు. సినిమాలో కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో యాక్షన్ హైలైట్ అవుతుందని 'రుద్రుడు' యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. 'ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్, ఇట్ ఈజ్ క్రియేటడ్' అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక.


'రుద్రుడు' సినిమాలో రాఘవా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లో  కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.


లారెన్స్ ప్రస్తుతం ‘చంద్రముఖి 2’లో కూడా నటిస్తున్నారు. ‘చంద్రముఖి 2’ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’. ఆప్తమిత్ర అనే కన్నడ చిత్రానికి రీమేక్ గా, 2005 లో వచ్చిన ఈ సినిమా తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. హారర్ కామెడీ చిత్రాలకు శ్రీకారం చుట్టింది. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి భయపెడుతూ నవ్వించడానికి సీక్వెల్ మూవీ 'చంద్రముఖి 2' రెడీ అవుతోంది. కాకపొతే ఈసారి కొత్త క్యాస్టింగ్ తో వస్తున్నారు.


తలైవా నటించిన హారర్ కామెడీ చిత్రానికి సీక్వెల్ కావడంతో 'చంద్రముఖి 2' పై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాకపొతే అధ్బుతమైన నటన కనబరిచిన రజినీ కాంత్ - జ్యోతిక స్థానాల్లో రాఘవ లారెన్స్ , కంగనా ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. 


ఇందులో కంగనా రనౌత్ ఒక రాజ నర్తకిగా కనిపించనుంది. దీని కోసం ఆమె క్లాసికల్ డ్యాన్స్ లో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదటి భాగాన్ని మించి అలరిస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నిజానికి 'చంద్రముఖి' సీక్వెల్ గా తెలుగులో 'నాగవల్లి' అనే సినిమా వచ్చింది. విక్టరీ వెంకటేష్, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి ఇప్పుడు చేస్తున్న 'చంద్రముఖి' సీక్వెల్ బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.