ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట, అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెల్చుకుని భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. కీరవాణి స్వర పరిచిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ జోష్ ఫుల్ స్టెప్పులు తోడవడంతో సినీ అభిమానులకు ఎంతో నచ్చింది. సినిమా థియేటర్లలో ‘నాటు నాటు’ పాట వస్తుంటే చాలు ప్రేక్షకులు  కూడా స్టెప్పులు వేస్తున్నారు. ఆడియెన్స్ ను అంతలా ప్రభావితం చేసే ఈ పాట కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఎంతో కష్టపడ్డారు. పాట కోసం రూపొందించిన స్టెప్స్ వెనుక శ్రమ పడ్డారో తాజాగా వివరించారు.






2 నెలల సాధన, 20 రోజుల కష్టం


ఈ పాట కోసం రూపొందించిన స్టెప్స్ సీక్వెన్స్ కోసం ఏకంగా 20 రోజులు పట్టినట్లు చెప్పారు. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ పాటకు ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల గంటన్నర పాటు ఏడ్చినట్లు చెప్పారు. “నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. వాష్‌ రూమ్‌ లో గంటన్నరకు పైగా ఏడ్చాను. రాజమౌళి గారి కృషి వల్లే ఇది జరిగింది. ఇద్దరు హీరోలు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వల్ల సాధ్యం అయ్యింది. వారిద్దరూ చాలా మంచి డాన్సర్లు. కీరవాణి  సంగీతం ఈ పాటకు ప్రాణంగా నిలిచింది. హుక్ స్టెప్స్ కోసం ఎంతో కష్టపడ్డాం. వీటి కోసం హీరోలు ఇద్దరూ చాలా కఠినమైన రిహార్సల్స్ చేశారు. రెండు నెలల గ్రౌండ్ వర్క్ చివరికి ‘నాటు నాటు’ పాటగా రూపొందింది. ఈ పాట కోసం మేం ఉదయం 6 గంటలకు మేల్కొని, రాత్రి 10 గంటలకు పడుకునే వాళ్లం. వారి కోసం ఏకంగా 118 స్టెప్స్ కొరియోగ్రఫీ చేశాను” అని చెప్పారు.  


కష్టానికి తగిన ప్రతిఫలం వస్తోంది


“వాస్తవానికి ఇద్దరూ మంచి డ్యాన్సర్లు. వారిద్దరిలో ఏ ఒక్కరూ ఎక్కువ, తక్కువ అన్నట్లు ఉండకూడదనుకున్నాం. అనుకున్నట్లుగానే స్టెప్స్ డెవలప్ చేశాం. అన్నీ అనుకున్నట్లుగా వచ్చాయి. పాట అవుట్ ఫుట్ కూడా చాలా బాగా వచ్చింది. పడిన కష్టానికి ప్రతిఫలంగా అంతర్జాతీయ వేదికపై ప్రతిష్టాత్మక అవార్డులు వస్తున్నాయి. మాకు ఎంతో సంతోషంగా ఉంది” అని ప్రేమ్ రక్షిత్ వెల్లడించారు.



Read Also: టీమిండియా ఆటగాళ్లను కలిసిన జూనియర్ ఎన్టీఆర్ - హైదరాబాద్‌లో సందడే సందడి!