ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం). రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా పాన్ ఇండియా కాన్సెప్ట్ తో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయినట్లే.. కొంత ప్యాచ్ వర్క్ జరుగుతోంది. అక్టోబర్ 13న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనికోసం 'ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్' పేరుతో ప్రత్యేక గీతాన్ని రూపొందించబోతున్నారు. చాలా రోజులుగా ఈ విషయం మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనిరుధ్ ఈ పాటను కంపోజ్ చేయబోతున్నట్లు చెప్పారు. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది.
అయితే ఈ పాట ఎవరు కంపోజ్ చేయబోతున్నారు..? ఎవరు పాడబోతున్నారనే విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఈ పాటను ఆలపించనున్నారు. స్నేహం విలువ చాటి చెప్పే ఈ పాటకు 'దోస్త్' అనే పేరు పెట్టుకున్నారు. ఆగస్టు 1న ఈ పాటను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
'ఆర్ఆర్ఆర్'కు సంబంధించి ఇప్పటికే అన్ని హక్కులు అమ్ముడైపోయాయి. శాటిలైట్ రైట్స్ కి భారీ ధర పలికింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా వచ్చినట్లు సమాచారం. దక్షిణాదిన మొత్తం హక్కులను స్టార్ నెట్ వర్క్ దక్కించుకుంది. ఉత్తరాదిన పెన్ స్టూడియోస్ సొంతం చేసుకుంది. రీసెంట్ గా సినిమా మ్యూజిక్ రైట్స్ కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. సౌత్ మొత్తానికి గాను లహరి సంస్థ, ఉత్తరాదిన టీ సిరీస్ సంస్థ 'ఆర్ఆర్ఆర్' మ్యూజిక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాయి. మొత్తంగా కలిపి రూ.25 కోట్లకు అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది.
ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని పలువురు హాలీవుడ్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.