ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు ఇప్పుడు అధికారికంగా బయటకు వచ్చాయి. హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్లు, జీఎస్టీ కాకుండా ఈ సినిమా మేకింగ్ కాస్ట్ రూ.336 కోట్లు అయిందని ప్రభుత్వానికి ఇచ్చిన అప్లికేషన్‌లో చిత్ర బృందం తెలిపింది. ఈ విషయాన్ని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.


ఈ సినిమాకు టిక్కెట్ ధర పెంపునకు కూడా అనుమతి లభించింది. అన్ని క్లాసుల టిక్కెట్ల మీద రూ.75 వరకు టిక్కెట్ ధరను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అంటే ఈ సినిమాకు కనిష్ట ధర రూ.100గానూ, గరిష్ట ధర రూ.325గానూ ఉండనుందన్న మాట.


ఇక వార్తల్లో వినిపిస్తున్న కథనాల ప్రకారం... హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌తో కలిపి రూ.478 కోట్లు ఈ సినిమాకు ఖర్చయినట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి ముందస్తు రెమ్యునరేషన్ తీసుకోకుండా నెలవారీ జీతం మీద ఈ సినిమాకు పనిచేశారని సమాచారం. అయితే సినిమా బిజినెస్ ముగిశాక వచ్చిన లాభాలను దర్శక నిర్మాతలు చెరో 50 శాతం పంచుకోనున్నారు.


అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ బడ్జెట్ రూ.550 కోట్ల వరకు అయిందని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు. ప్రభుత్వానికి చెప్పిన లెక్కలకు, ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన లెక్కలకు రూ.70 కోట్లకు పైగా తేడా ఉంది. ప్రమోషనల్ కాస్ట్, వడ్డీలను కూడా రాజమౌళి బడ్జెట్లో కలిపి చెప్పినట్లున్నారు. సినిమా బిజినెస్ రూ.890 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది.


ఈ సినిమా మార్చి 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. మార్చి 24వ తేదీ రాత్రి నుంచే పెయిడ్ ప్రీమియర్లు వేస్తారని సమాచారం. ప్రీమియర్లకు ఎంత ధర నిర్ణయిస్తారు అనే సంగతి ఇంకా తెలియరాలేదు.