కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెద్ద సినిమాల మేకింగ్ బాగా ఆలస్యమైంది. విడుదల తేదీలను వాయిదా వేయక తప్పలేదు. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలనే వాయిదా వేశారు అలాంటిది 'RRR' చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎలా ఉంటారని అంతా అనుకున్నారు. పైగా జక్కన్న డెడ్ లైన్స్ పెట్టుకొని పని చేయరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సినిమా చెప్పిన టైమ్ కి రాదని అనుకున్నారు. కానీ అక్టోబర్ 13న కచ్చితంగా సినిమా వస్తుందని చెప్పి ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. ఈ ఏడాది దాదాపు మూడు నెలల షూటింగ్ ఆగిపోతే చెప్పిన డేట్ ను అందుకోవడం అసాధ్యమని అనుకున్నారు. వచ్చే సంక్రాంతికి లేదంటే సమ్మర్ కి సినిమా వస్తుందని.. అప్పుడు చూసుకోవచ్చని ప్రేక్షకులు భావించారు.

 

చెప్పిన టైమ్‌కే.. 

 

తాజాగా 'ఆర్ఆర్ఆర్' టీమ్ నుంచి వచ్చిన షూటింగ్ అప్డేట్ చూస్తే అక్టోబర్ 13న ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అనిపిస్తోంది. అయితే చిత్రయూనిట్ పదే పదే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తుండడానికి ఓ కారణం ఉందని సమాచారం. 

 


 

ఈ హడావిడికి అసలు కారణం.. 

 

'RRR' సినిమాకి రకరకాలు కొనుగోలుదారులు ఉన్నారు. వాళ్లలో పెన్ స్టూడియోస్ ఒకటి. ఆ సంస్థ సుమారు వంద కోట్లు 'RRR'కు అడ్వాన్స్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థతో ఉన్న లీగల్ అగ్రిమెంట్ ప్రకారం.. అక్టోబర్ 13న సినిమా విడుదలై తీరాల్సిందే. అందుకే డేట్ ను ఒకటికి పదిసార్లు అనౌన్స్ చేస్తున్నారు. అయితే అదే సమయంలో థర్డ్ వేవ్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే అమెరికాలో కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో లాక్ డౌన్ లేకుంటే గనుక సినిమా చెప్పిన సమయానికి వచ్చేస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే డిసెంబర్ మూడో వారానికి సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉంది. 

 

ప్రమోషన్స్ ఓ రేంజ్ లో.. 

 

విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఇండియాలో అత్యధిక అంచనాలు ఉన్న సినిమా ఇది. పైగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతుండటంతో ముందు నుంచే అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఇప్పుడు ఇక 'ఆర్ఆర్ఆర్' మ్యూజికల్ బొనాంజాతో అంచనాలు ఇంకా పెంచడానికి సిద్ధమైంది కీరవాణి బృందం. 

 

కీరవాణి స్ట్రాటజీ.. 

 

'RRR' నుండి ఒక్కో పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొలిపాటతోనే బజ్ ను క్రియేట్ చేయాలని కీరవాణి ఫిక్స్ అయిపోయారు. ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నారు. స్నేహం కాన్సెప్ట్ తో ఈ పాటను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే..  ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు, ముగ్గురు మంచి గాయకులు కలిసి ఈ పాట కోసం పని చేశారు. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను  తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, ప్రముఖ బాలీవుడ్ మ్యుజీషియన్ అమిత్ త్రివేదిలతో పాటు గాయకులు హేమచంద్ర, విజయ్ ఏసుదాస్, యాజిన్ నజీర్ లు ఆలపించారు. ప్రోమో వీడియోల్లోనే బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ వారెవా అనిపించిన కీరవాణి.. మరి ఈ పాటతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి. 

 


 

 

వేరే లెవెల్.. 

 

సినిమాలో 'దోస్తీ' సాంగ్ ఎలా ఉండబోతుందనే విషయాన్ని సింగర్ హేమచంద్ర తాజాగా చెప్పుకొచ్చారు. పాట పాడడం ఒకెత్తు అయితే ప్రమోషన్ షూట్ లో ఉండడం మరో ఎత్తు అని హేమచంద్ర అన్నారు. ఈ పాట ఎలా వచ్చింది..? ఎంత గొప్పగా వచ్చిందనేది మాటల్లో చెప్పలేకపోతున్నానని.. సాంగ్ షూట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకొచ్చారు. హేమచంద్ర మాటలు అభిమానుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచాయి.