Champion Movie Shooting Began: తెలుగు సిని పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్న ఆయన.. గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా విలక్షణ పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ఆయన కుమారుడు రోషన్. ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. 2021లో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతోనే శ్రీలీల హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కావడం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగినా, రోషన్ మాత్రం మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
రోషన్ సినిమా షూటింగ్ ప్రారంభం
ప్రస్తుతం రోషన్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో హీరోగా సినిమా చేస్తున్నాడు. ‘ఛాంపియన్’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించిన చాలా రోజులకు మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. షూటింగ్ మొదలు పెట్టినట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టి మూవీ షూటింగ్ ను ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఛాంపియన్’
ఇక ఈ సినిమాకు జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది నెలల క్రితం రోషన్ బర్త్ డే సందర్భంగా ‘ఛాంపియన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రోషన్ అందంగా, స్టైలిష్ గా కనిపించాడు. పొడవైన జట్టు, గడ్డంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ తోనే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ రోషన్ ఫుట్ బాల్ ప్లేయర్ గాకనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ మూవీ రోషన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారబోతున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమా సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నారు. సుధాకర్ రెడ్డి యక్కంటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి. అటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వృశభం’లో రోషన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన మోహన్ లాల్ కొడుకుగా కనిపించనున్నాడు. విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ ఇంటెన్స్ డ్రామాలో మోహన్ లాల్, రోషన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read: 'తంగలాన్'కు పార్ట్ 2 కూడా ఉంది - కన్‌ఫాం చేసిన హీరో విక్రమ్