సినిమా టిక్కెట్ల ఇష్యూ వచ్చిన దగ్గర్నుంచి సినీ దర్శకనిర్మాత రామ్‌గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఘటనపై ట్వీట్లు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశంపై ఆయన ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా ఉద్యోగుల ఉద్యమంపైనా మాట్లాడారు. విజయవాడలో అంత మందిని చూసి తనకు చలి జ్వరం వచ్చిందన్నారు.  ఆర్జీవీకి విజయవాడలో ఎంతో అనుబంధం ఉంది. 


 






విజయవాడలో తన స్టూడెంట్ లైఫ్ జరిగినందున అలాంటి ర్యాలీ అక్కడ జరగడం చూసి ఆర్జీవీ ముచ్చటపడి ట్వీట్ పెట్టారని అనుకోవడానికి లేదు. వెంటనే..  సొంత ప్రభుత్వంపై ఇంత మంది ఉద్యోగులు తిరుగుబాటు చేసిన ఘటన ప్రపంచంలో మరెక్కడైనా జరిగిందా అని ఆశ్చర్యపోతూ మరో ట్వీట్ పెట్టారు. 



అలాగే ఏపీ ప్రభుత్వం పై అసంతృప్తికి గురైన వారికి ఓ సలహా కూడా ఇచ్చారు. సమయం, సందర్భం చూసి పోరాటం చేయాలని.. సైలెంట్‌గా ఉండటం పిరికితనమన్నట్లుగా సందేశాన్ని ఇచ్చేశారు. 


 






ఆర్జీవీ ట్వీట్లు ఏపీ ప్రభుత్వం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న టాలీవుడ్‌ పెద్దలను ఉద్దేశించేనని భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇప్పుడు నోరు తెరవకపోతే ఇంకెప్పుడు తెరవలేరని ఆయన హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ట్వీట్లు పెట్టారు.  ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. సొంత ప్రభుత్వంపై ఉద్యోగులే తిరుగుబాటు చేసినప్పుడు టాలీవుడ్ వారికి ఏమొచ్చిందన్న సందేహం ఆయన ట్వీట్లలో కనిపిస్తోందంటున్నారు. 


 






ఆర్జీవీ ట్వీట్లు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.  సినిమా టిక్కెట్ల అంశంలో  నేరుగా మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ చర్చలు జరిపారు కానీ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.  చిరంజీవి - సీఎం జగన్ మధ్య భేటీ జరిగినా ఫలితం లేదు. అందుకే ఆర్జీవీ ఇప్పుడు ఇండస్ట్రీకి పరోక్షంగా దిశానిర్దేశం చేస్తున్నారని భావిస్తున్నారు.