Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్ మాస్టర్‌ (55) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంత కాలం క్రితం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం ఆయనకు రక్త విరేచనాలు కావడంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్ కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.


1968 సంవత్సరంలో తిరుపతి నగరంలో రాకేష్ మాస్టర్ జన్మించారు. ఆయనకు నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. ‘ఆట’, ‘ఢీ’ లాంటి డ్యాన్స్‌ రియాల్టీ షోల్లో కూడా రాకేష్ మాస్టర్ పాల్గొన్నారు. దాదాపు 1500లకు పైగా సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.


రాకేష్ మాస్టర్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ యూట్యూబ్‌ ఛానళ్లకు వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉన్నారు. ఒక ప్రముఖ కామెడీ షోలో కూడా కొన్ని ఎపిసోడ్స్‌లో నటించారు.


టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్‌ కొరియోగ్రాఫర్‌లు అయిన శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్లు రాకేశ్‌ మాస్టర్‌కు శిష్యులే. రాకేశ్‌ మాస్టర్‌ పేరును శేఖర్ మాస్టర్ టాటూ కూడా వేయించుకున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌కు కూడా రాకేష్ మాస్టర్ శిక్షణ ఇచ్చారు. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు వంటి సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. రాకేష్ మాస్టర్‌కు నెటిజన్లు నివాళులు అర్పిస్తున్నారు.