Redin Kingsley Weds Sangeetha: కోలీవుడ్ లో మంచి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రెడిన్‌ కింగ్‌స్లే. తమిళ టాప్ కమెడియన్లలో ఆయన ఒకరుగా కొనసాగుతున్నారు. ‘డాక్టర్’, ‘బీస్ట్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గర అయ్యారు. రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి ‘ది వారియర్’ సినిమాలో ఆయన కామెడీ అలరించింది.  ఈ ఏడాది రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ ‘జైలర్’ సినిమాలోనూ అద్భుతమైన కామెడీతో ఆకట్టుకున్నారు. ఈ తమిళ క్రేజీ యాక్టర్ తాజాగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. మూడు ముళ్ల బంధంతో బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేశాడు. టీవీ ఆర్టిస్టు సంగీతను పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్దతిలో ఆమెను తన భార్యను చేసుకున్నారు.


సింపుల్ గా పెళ్లి చేసుకున్న రెడిన్‌


రెడిన్‌, సంగీత వివాహం చెన్నైలో సింపుల్ గా జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధు మిత్రుల ఆశీర్వాదాల నడుమ వీరు పెళ్లి చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సినీ జనాలతో పాటు నెటిజన్లు, అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. సంగీత, రెడిన్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో తాజాగా పెళ్లి చేసుకుని, సంసార జీవితంలోకి అడుగు పెట్టారు.














తన మార్క్ నటనతో అలరిస్తున్న రెడిన్


ఇక నటుడిగా రెడిన్ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తన మార్క్ నటనతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తారు. ఆయన ఆహార్యం, వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రెడిన్ సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నటించిన ‘కొలమావు కోకిల’ సినిమాతో కమెడియన్ గా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ‘డాక్టర్‌’ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో తన నటనకు గాను ఉత్తమ కమెడియన్‌గా ‘సైమా’ అవార్డు అందుకున్నారు. విజయ్‌ దళపతి ‘బీస్ట్‌’, విజయ్‌ సేతుపతి ‘కాతువాకుల రెండు కాదల్‌’ తదితర చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’తో రెడిన్ మరింత పాపులర్ అయ్యాడు. ఈ సినిమాలు తెలుగులోనూ విడుదల కావడంతో ఆయన టాలీవుడ్ లోనూ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజానికి 1998లోనే రెడిన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అయితే, నటుడిగా కాకుండా డ్యాన్సర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అజిత్ నటించిన ‘అవా వరువాలా’ చిత్రంలో డ్యాన్సర్ గా కనిపించాడు. ఆ తర్వాత నటుడిగా, కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.


వరుస సినిమాలతో ఫుల్ బిజీ


ప్రస్తుతం రెడిన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా నయనతార  నటించిన ‘అన్నపూర్ణి’ సినిమాలో కనిపించారు. ఈ మూవీతో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. నీలేష్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అటు సతీష్ ‘కంజురింగ్ కన్నప్పన్‌’లోనూ నటించారు. సూర్య ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువా’లోనూ కనిపించనున్నారు. 


Read Also: మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డానికి మీరెవరు? రేణూ దేశాయ్‌ ఆగ్రహం