సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. పరిస్థితులను బట్టీ నిర్ణయాలు అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అది కేవలం ఒక్క సినిమాల విషయంలోనే కాదు ఆ సినిమాకు పనిచేసే ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. అలా జరగడానికి కారణాలు ఏమైనా తర్వాత ఆ సినిమా హిట్ అయితే ‘అయ్యో ఆ సినిమా నేను చేసి ఉండాల్సింది’ అని ఫీల్ అవుతూ ఉంటారు. దర్శకుడు, రచయిత మరుధూరి రాజా విషయంలో కూడా అలాంటి సంఘటన జరిగిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చిరంజీవి ‘హిట్లర్’ సినిమాలో రైటర్ గా తనకు అవకాశం వచ్చి తర్వాత మిస్ అవ్వడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయిందని, అలాంటి మంచి సినిమాలో అవకాశం పోయినందుకు అప్పుడప్పుడు బాధనిపిస్తుందని చెప్పారు. ఆ సినిమాలో తనకు వచ్చిన అవకాశం ఎలా మిస్ అయిందో చెప్పుకొచ్చారు రాజా.


‘హిట్లర్’ మోహన్ బాబుతో చేద్దామనుకున్నాం: మరుధూరి రాజా


మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘హిట్లర్’ ఆ సినిమా చాలా బాగుంటుందని, అది మనం చేద్దాం అని ఎడిటర్ మోహన్ తనతో చెప్పారని అన్నారు రాజా. ముందు మోహన్ బాబుతో ఈ సినిమా చేద్దామని, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణను సంప్రదించాలని ఎడిటర్ మోహన్ తనకు చెప్పారని తెలిపారు. అదే విషయాన్ని తాను ఈవీవీతో చెప్తే.. ఇప్పటికే మోహన్ బాబుతో రెండు సినిమాలు చేస్తున్నానని, మళ్లీ మూడో సినిమా వద్దులే అని తాను చెయ్యలేనని చెప్పారట ఈవీవీ. దీంతో సర్లే అని వదిలేశామని చెప్పారు. అయితే నాలుగు రోజుల తర్వాత ఎడిటర్ మోహన్ తనకు ఫోన్ చేసి ‘హిట్లర్’ను చిరంజీవి చేస్తున్నారని చెప్తే సంతోషించానని అన్నారు. ఎడిటర్ మోహన్ తనకు మలయాళ హిట్లర్ సినిమా క్యాసెట్ లు పంపారని, ఫస్ట్ ఆఫ్ చూసిన తర్వాత ఎడిటర్ మోహన్ కు ఫోన్ చేసి మనం మంచి సినిమా తీస్తున్నామని చెప్పానన్నారు. తర్వాత సెకండ్ ఆఫ్ కూడా చూసి ఈ సినిమా సూపర్ హిట్ మనకు తిరుగులేదు అని మోహన్ కు ఫోన్ చేసి చెప్పానని అన్నారు. చిరంజీవితో సినిమా అని ఫుల్ గా ప్రిపేర్ అయిపోయానని చెప్పారు.


సినిమా ఓకే అయ్యాక రైటర్ గా నా పేరు కనిపించలేదు, నాపై కుట్ర జరిగింది


చిరంజీవి ‘హిట్లర్’ సినిమాకు తాను రైటర్ గా చేస్తున్నానని సంతోషించేలోపే నిర్ణయాలు మారిపోయాయని అన్నారు. అప్పటి వరకూ తానే రైటర్ అని అందరూ అనుకున్నారని కానీ, డైరెక్టర్ గా ముత్యాల సుబ్బయ్య వచ్చాక రైటర్ ను మార్చేసారని అన్నారు. అప్పటి వరకూ తన పేరు ఉంచి డైరెక్టర్ వచ్చాక పేరు తీసేసారంటే దానికి కారణం ఎవరై ఉంటారు చెప్పక్కర్లేదన్నారు. ఆ సినిమా మిస్ అయినందుకు బాధగా లేదని, కానీ ఆ సినిమాలో కుట్ర జరిగిందని, అందులో భాగంగానే తనను పక్కన పెట్టారని అన్నారు. అలా ఆ సినిమాకు రైటర్ గా చేయాల్సిన ఆయన ఆ అవకాశాన్ని ఎలా మిస్ అయ్యారో చెప్పుకొచ్చారు రాజా.



Read Also: చెర్రీ, తారక్‌లతో కలిసి పనిచేయాలని ఉంది - ‘థోర్’ హీరో క్రిస్ హేమ్స్‌ వెల్లడి, RRRపై ప్రశంసలు