సూపర్ హీరో సినిమాలంటే మనకి గుర్తొచ్చేది హాలీవుడ్ సినిమాలే. ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఒక్కో సూపర్ హీరోకి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగే వేరు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. థియేటర్ల వద్ద క్యూ కట్టేస్తారు. ఇండియాలో కూడా ఇదే పరిస్థితి. 'ఎవెంజర్స్' సినిమా సమయంలో ఇక్కడ ఏ రేంజ్ లో హడావిడి కనిపించిందో తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఆ సినిమాల స్పూర్తితో ఇండియాలో కూడా కొన్ని సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కాయి.
కానీ మనకంటూ ప్రత్యేకంగా వచ్చిన సూపర్ హీరో సినిమాలు చాలా తక్కువ. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ 'క్రిష్' పేరుతో కొన్ని సినిమాలు సిరీస్ లుగా తీసి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ సిరీస్ లో త్వరలోనే నాల్గో సినిమా రాబోతుంది. ఈ జోనర్లో తెలుగులో అసలు సినిమాలే లేవని చెప్పాలి. దశబ్దాల క్రితం సీనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమాల స్పూర్తితో 'సూపర్ మ్యాన్' పేరుతో ఓ సినిమా చేశారు కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఎన్టీఆర్ సూపర్ హీరో కాస్ట్యూమ్స్ ధరించి నటించడం చాలా కామెడీగా అనిపిస్తుంది.
అయితే ఇప్పుడు మన దగ్గర టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ప్రపంచస్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో టెక్నాలజీను గొప్పగా ఉపయోగించుకుంటూ అద్భుతాలు సృష్టిస్తున్నారు టాలీవుడ్ దర్శకుడు. ఇలాంటి సమయంలో సూపర్ హీరో సినిమాలు చేస్తే బాగానే వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు టాలీవుడ్ లో ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది.
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తోన్న ఈ సినిమాకి 'హనుమాన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు మరో సూపర్ హీరో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాచో మ్యాన్ దగ్గుబాటి రానా.. సూపర్ మ్యాన్ అవతారమెత్తబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రానా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు..? ఏ ప్రొడక్షన్ హౌస్ నిర్మించబోతుందనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
ప్రస్తుతం రానా.. పవన్ కళ్యాణ్ తో కలిసి 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమా రీమేక్ లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన చేయబోయేది సూపర్ హీరో కాన్సెప్టే. చివరగా రానా 'అరణ్య' అనే సినిమాలో కనిపించరు. అది డిజాస్టర్ అయింది. రానా నటించిన 'విరాటపర్వం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే అది ఓటీటీలో విడుదలవుతుందా..? లేక థియేటర్లో రిలీజ్ చేస్తారా..? అనే విషయంలో క్లారిటీ లేదు.