టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా ‘రంగమార్తాండ’. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు.  ఈ మూవీ ఉగాది సందర్భంగా విడుదల అయి సక్సెస్ఫుల్ గా థియేటర్లలో రన్ అవుతుంది. ఈ సినిమాతో చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నారు వంశీ. ఈ మూవీలో నటించిన రమ్యకృష్ణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి, అలాగే దర్శకుడు కృష్ణవంశీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ఆయన కష్టం చూసి నేనే చేస్తా అన్నాను : రమ్యకృష్ణ


‘రంగమార్తాండ’ సినిమాను మరాఠీలో వచ్చిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు కృష్ణవంశీ మార్పులు చేర్పులు చేశారు. తెలుగులో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించారు. అయితే ప్రకాష్ రాజ్ భార్య పాత్ర కోసం రమ్యకృష్ణ కంటే ముందు వేరే యాక్టర్ కోసం ప్రయత్నించారట కృష్ణ వంశీ. ఈ విషయాన్ని రమ్యకృష్ణ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ఆ పాత్ర కోసం ఎవర్నీ తీసుకుందామా అని వంశీ చాలా మందిని వెతికారని, కానీ ఎవరూ సెట్ అవ్వలేదని అన్నారు. ఆయన కష్టం చూసి తానే చేస్తానని అన్నానని, అలా ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని చెప్పారు. 


భర్తగా కంటే దర్శకుడిగానే ఇష్టం..


‘రంగమార్తాండ’ సినిమా ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చిందని అన్నారు రమ్యకృష్ణ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటవిశ్వరూపం చూపించారని అన్నారు. ఆయనలోని నటడుని కృష్ణవంశీ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. అలాగే బ్రహ్మానందం కూడా తన రెగ్యులర్ ఫార్మాట్ పాత్రలు కాకుండా విలక్షణ నటనను కనబర్చారని అన్నారు. ఈ మూవీతో ఆయనలోని మరోనటుడు తెరపైన కనిపించారని అన్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు.


ఇక కృష్ణవంశీ దర్శకత్వం గురించి మాట్లాడుతూ.. భర్తగా కంటే దర్శకుడిగానే ఆయన్ను ఎక్కువ ఇష్టపడతానని అన్నారు. ఆయన సినిమాను తెరకెక్కించే తీరు ఎంతో బాగుంటుందని తెలిపారు. ఈ మూవీలో కూడా ఆయన మార్క్ దర్శకత్వం కనిపిస్తుందని పేర్కొన్నారు. యాక్టర్స్ ఎంతబాగా నటించినా దాన్ని స్క్రీన్ మీద చూపించేది దర్శకుడేనని, ఆ క్రెడిట్ అంతా ఆయనదేనన్నారు. అయితే షూటింగ్ సమయంలో ఆయన చాలా కఠినంగా ఉంటారని.. సీన్ సరిగ్గా రాకపోతే పదే పదే చేయిస్తారని కొంతమంది అటుంటారనీ.. నిజానికి మన నటనలో సత్తా ఉంటే అలాంటి దర్శకుల డైరెక్షన్ మజా వస్తుందని అన్నారు.


రాజమౌళి దర్శకత్వం కూడా అలాగే ఉంటుందని, వాళ్లు సీన్ వివరిస్తుంటే సన్నివేశం అంతా కళ్లముందు కనబడుతుందని అన్నారు. అంతగొప్పగా సీన్ నరేట్ చేస్తారని చెప్పుకొచ్చారు. అందుకే తనకు చాలా సంవత్సరాల తర్వాత కృష్ణవంశీతో కలసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే అవార్డుల గురించి మాట్లాడుతూ.. తాను అవార్డుల గురించి అంతగా పట్టించుకోనని అన్నారు. పాత్ర నచ్చితే చేస్తానని, తర్వాత దాని గురించి ఆలోచించనని, తన పని తాను చేసుకుంటూ పోతానని పేర్కొన్నారు రమ్యకృష్ణ. 


Also Read: వేసవిలో వినోదం - సమ్మర్‌లో సందడి చేయనున్న సినిమాలివే, మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికీ?