వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వంచనగిరి గ్రామంలోని గండి మైసమ్మ ఆలయంలోని అమ్మవారికి మందు తాగించారు. దేవుడిపై నమ్మకం లేని వర్మ ఇలా అమ్మవారికి మందు తాగించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. వర్మ 'కొండా' అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కోసం వర్మ వరంగల్ కు చేరుకున్నారు. అక్కడ వంచనగిరి గ్రామంలో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందు అక్కడ ఉన్న గండి మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు వర్మ.
అలానే అక్కడ సంస్కృతిని ఫాలో అవుతూ గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ముందుగా కొండా దంపతుల ఇంటి నుంచి ర్యాలీగా బయలుదేరాలని వర్మ భావించారు. కానీ పోలీసులు ఒప్పుకోలేదు. వివాదాస్పద కథలతో ప్రేక్షకులను అలరించే వర్మ ఈసారి తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతులు కొండా మురళి, సురేఖల జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించబోతున్నారు.
దీనికి సంబంధించిన పోస్టర్స్ ను కూడా వర్మ విడుదల చేశారు. 1980లలో జరిగిన సంఘటనల ఆధారముగా సినిమాను రూపొందించనున్నారు. నటుడు అరుణ్ అదిత్ ఇందులో కొండా మురళి పాత్ర పోషిస్తున్నారు. ఇర్రా మోర్ కొండా సురేఖ పాత్రలో కనిపించనుంది.