దర్శకధీరుడు రామమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీ అంతర్జాతీయంగా వరుసగా అవార్డులను కొల్లగొట్టడమే కాకుండా ఆస్కార్ బరిలో కూడా నిలవడం విశేషం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అమెరికా పర్యటనలో ఉంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ను అమెరికా ఏస్ హోటల్ లో రీ రిలీజ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్. ఇందులో 1647 సీట్లు ఉంటాయి. దీంతో ఈ సినిమా చూసేందుకు అభిమానులు పోటెత్తారు. చిత్ర బృందం కూడా అభిమానులతో కలసి సినిమాను వీక్షించారు.
ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ అక్కడ ప్రేక్షకులను కలిశారు. వారితో కలసి సెల్ఫీలు దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. సినిమా చూసేందుకు పోటెత్తిన అభిమానులను చూసి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘‘ఏస్ థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్ జరిగింది. మీ నుంచి వచ్చిన స్పందన, స్టాండింగ్ ఓవేషన్ చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటాయి. మీ అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారాయన. ప్రస్తుతం రామ్ చరణ్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలు చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారట.
RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంటూ వస్తోంది. గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోగా ఇటీవల హీలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను గెలుచుకుంది. ఈ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు రావడం విశేషం. ఈ అవార్డులను అందుకోవడమే కాకుండా రామ్ చరణ్ ను ప్రజెంటర్ గా కూడా ఆహ్వానించారు. అంతేకాకుండా రామ్ చరణ్ కు స్పాట్ లైట్ అవార్డు కూడా లభించింది. ఇదే కాకుండా ఆయనకు అంతర్జాతీయంగా పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుతున్నాయి. ఇక మార్చి 13 న జరగబోయే అస్కార్ అవార్డుల వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అంతా హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంటున్న నేపథ్యంలో కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్ లో ప్రదర్శించనున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈ పాటకు ఆస్కార్ వేదికపై స్టెప్పులేయనున్నారు. ఈ ఆస్కార్ వేడుకల తర్వాత రామ్ చరణ్ అమెరికా పర్యటన ముగుస్తుంది. తర్వాత ఆయన ప్రముఖ రామ్ చరణ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ సి 15’ షూటింగ్ లో పాల్గొనున్నారు. ఈ మూవీను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియార అద్వానీ రెండోసారి రామ్ చరణ్ సరసన కనిపించనుంది. శంకర్ దర్శకత్వంలో సినిమా కావడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.