GIS Summit 2023: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో దేశ విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పటిష్టమైన నాయకత్వమే ఏపీలో పెట్టబడులు ఆకర్షించే మంత్రమన్నారు.
ఇంకా ఎవరు ఏమన్నారంటే...
ఇంధన పొదుపుపై దృష్టి ప్రశంసనీయం: కరణ్ అదానీ
ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ప్రతిభ ఉన్న యూత్ ఉంది. వ్యాపార అనుకూల వాతావరణం ఉది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇంధన పొదుపుపై దృష్టి సారించినందుకు రాష్ట్ర నాయకులను నేను అభినందిస్తున్నాను. పోర్ట్‌లపై apతో భాగమై ఇప్పటికే 20 వేల కోట్లు పెట్టుబడి పెట్టి 18 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాం. 100 ml మెట్రిక్ టన్ను కెపాసిటీని నిర్వహిస్తున్న రెండు పెద్ద ఓడరేవులను పారిశ్రామిక పోర్టులుగా మారుస్తాము. APలో 15k mg పునరుత్పాదక శక్తిని అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాము. 10 మిలియన్ టన్నులతో అంబుజా, అదానీ సిమెంట్ రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. - కరణ్ అదానీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ CEO
ఏపీ శక్తిని ఎప్పుడో గుర్తించాం: ముఖేష్ అంబానీ
ఏపీలో విస్తారమైన భమి, ప్రతిభ ఉన్న మానవ వనరులు, సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నాయి. అద్భుతమైన ఎంటర్‌ప్రెన్యూర్‌లు ఏపీని ముందుండి నడిపిస్తున్నారు. రిలయన్స్‌లో ఉన్న మంచి మేనేజర్‌లు ఏపీ నుంచే ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత దేశ వృద్ధిలో ఏపీది కీలకమైన పాత్ర. ఆంధ్రప్రదేశ్ శక్తిని గతంలోనే మేం గుర్తించాం. అప్పటి నుంచే ఏపీ అభివృద్ధిలో రిలయన్స్ భాగమైపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో 40000 కోట్లు పెట్టుబడి పెట్టి జియో అతిపెద్ద నెట్‌వర్క్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో రిలయల్స్ రిటైల్ 20000 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తోంది. విద్య, గ్రామీణ అభివృద్ధి కోసం రిలయన్స్ ఫౌండేషన్ పనిచేస్తోంది. ఇక్కడ మా పెట్టుబడులను కొనసాగిస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లో 10గిగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెడతాము.
మా ప్రయాణమే చాలా సాహసం: టెస్లా మాజీ సీఈవో
2002లో కార్ల తయారీ కంపెనీ చాలా క్రేజీగా ప్రారంభమైంది. అసలు ఇలాంటి ఆలోచనతో ఆటోమొబైల్ కంపెనీ పెట్టాలనే ఆలోచన ఎవరూ చేయరేమో. అంతా కొత్తవారితా మేం స్టార్ట్ చేశాం అందులో ఒక్కరికి కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో అనుభవం లేదు. అయినా ప్రారంభించాం. మొత్తం బాధ్యత తీసుకున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వాటికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో మేం చాలా సమస్యలు ఎదుర్కొన్నాం.. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకొని మీ ముందు నిలబడ్డాం. నాకు ఏపీలో ఉన్న స్టార్టప్‌ల గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. - మార్టిన్ ఎబర్‌హార్డ్, టెస్లా సహ వ్యవస్థాపకుడు & మాజీ CEO
ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు: కియా మోటార్స్
రాష్ట్ర అభివృద్ధిలో కియా పాత్ర చాలా కీలక పాత్ర పోషించిందన్నారు కియా ఇండియా ప్రతినిధి కబ్‌డాంగ్ లీ. ప్రభుత్వ సహకారాలు కియా అబివృద్ధికి దోహదపడిందన్నారు. ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ ప్లాంట్‌ని నిర్మించాం. భూమి, విద్యుత్, నీటి సరఫరా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, రవాణా సౌకర్యాలు కల్పించారు. కోవిడ్ కాలంలో ఉద్యోగులను, ముడి సరకును సురక్షితంగా తరలించడంలో సహాయపడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.- కబ్ డాంగ్ లీ, కియా మోటార్స్ ప్రతినిధి
భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తాము: నవీన్ జిందాల్
"గత అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌తో మాకు ఉన్న సానుకూల అనుభవాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. మేము భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా దీనిని చూస్తాము. ఏపీలోని అద్భుతమైన మౌలిక సదుపాయాలు, భారీ తయారీ స్థావరం, ప్రతిభావంతులైన యువత మరియు అద్భుతమైన వ్యాపార అనుకూల వాతావరణం కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దాని దూరదృష్టితో కూడిన నాయకత్వం మరియు ప్రభుత్వ విధానాలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము." అని నవీన్ జిందాల్ వెల్లడించారు.
బొమ్మల పరిశ్రమకు మంచి అవకాశం: కృష్ణ ఎల్లా
ఆంధ్రప్రదేశ్‌లో బొమ్మల పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టాలి. మేము క్వినోవాపై దృష్టి పెట్టవచ్చు- కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్నన్
విద్యపై డబ్బు ఖర్చు సీఎం జగన్ దీర్ఘకాలిక ఆలోచన : బీవీఆర్ మోహన్
“పదిహేడేళ్ల క్రితం నేను కాకినాడలో ఆల్‌ఇండియన్ ఫెసిలిటీని ప్రారంభించాను. 2010లో వైఎస్‌ఆర్ హయాంలో నా రెండో ప్రాజెక్ట్‌ని వైజాగ్‌లో ప్రారంభించాను. వైజాగ్‌లో టెక్నాలజీ డబుల్ డిజిట్ గ్రోత్ సాధించేలా మా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నాను. నైపుణ్యం కలిగిన వ్యక్తులు, మౌలిక సదుపాయాలు మాకు చాలా ముఖ్యం. ఎక్కువ మంది హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. కానీ విద్యలో ముఖ్యమంత్రి జగన్ అద్భుతమైన కృషి చేస్తున్నారు. ఏపీలో విద్యారంగానికి రూ.1.12 లక్షల కోట్లు ఖర్చు చేశారు. విద్యకు డబ్బు ఖర్చు చేయడం అనేది సీఎం జగన్‌కు దీర్ఘకాలిక ఆలోచనకు ప్రతీక. నా రెండు అభ్యర్థనలు ఏంటంటే, ఉన్నత విద్యలో మార్పులు చేస్తే ప్రపంచానికి నాలెడ్జ్ క్యాపిటల్‌గా ఆంధ్ర మారేలా చేయొచ్చు. రెండోది ఆవిష్కరణ, వ్యవస్థాపకతను సృష్టించాలి - బివిఆర్ మోహన్ రెడ్డి: సైయంట్ వ్యవస్థాపక చైర్మన్
భోగాపురం గేమ్ ఛేంజర్: జీఎంఆర్
“నా స్వరాష్ట్రం విశాఖపట్నంలోని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ విమానాశ్రయం మొదటి దశలో ఆరు మిలియన్ల ప్రయాణీకులకు, పూర్తి సామర్థ్యంలో 30 మిలియన్ల ప్రయాణీకులకు సేవలు అందించనుంది. మొదటి దశలో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మేము విమానాశ్రయం చుట్టూ మెట్రోపాలిస్, ఎయిర్‌పోర్ట్ సిటీలను అభివృద్ధి చేస్తాము. ఇందులో పారిశ్రామిక జోన్, ఎయిర్‌స్పేస్ జోన్, విద్య, ఆరోగ్య సంరక్షణ జోన్‌లు ఉంటాయి. హైదరాబాద్ విమానాశ్రయం అనుభూతిని పునరావృతం చేస్తాం. ఇది వైజాగ్ రూపురేఖలు మార్చడంలో సహాయపడుతుంది. రాష్ట్రాన్ని అత్యంత ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా గ్లోబల్ మ్యాప్‌లో ఉంచుతుంది. - జి.ఎం.రావు, GMR గ్రూప్ చైర్మన్
అద్భుతాలు చేస్తాం: పునీత్ దాల్మియా
APతో మా అనుబంధం సుమారు 15 సంవత్సరాల క్రితం డాక్టర్ వైఎస్ రాజ్ శేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైంది. మేము కడప జిల్లాలో సుమారు 1000 కోట్ల పెట్టుబడితో సిమెంట్ ప్లాంట్‌ను స్థాపించనున్నాం. మాకు లభించిన ఈ మద్దతుతో నిజంగా అద్భుతాలు చేస్తాం. - పునీత్ దాల్మియా, దాల్మియా భారత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్
ఆ మూడు విషయాల్లో ఏపీ టాప్: సుమంత్ సిన్హా
“ జగన్ లాంటి సమర్థవంతమైన నాయకత్వంలో ఉన్న రాష్ట్రం ఇటీవల 2022లో గ్రీన్ అవార్డులను అందుకుంది. మౌలిక సదుపాయాల్లో ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. ఆంధ్రా మూడు విషయాల్లో గొప్పగా ఉందని చెప్పవచ్చు. సోలార్, విండ్ ఎనర్జీకి అవసరమైన వనరులు , ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉంది, డైనమిక్, దూరదృష్టి కలిగిన నాయకత్వం మరో గొప్ప విషయం. గ్రీన్ హైడ్రోజన్, పంపు, సోలార్‌పై వచ్చే ఐదేళ్లలో మేం పెట్టుబడులు పెట్టనున్నాం. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాం. - సుమంత్ సిన్హా, రెన్యూ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్