దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా జనవరి 7న విడుదల కాబోతుంది. దీనికోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ ట్రైలర్ చూసిన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా రాజమౌళిని పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ పెట్టారు. 


అయితే మొట్టమొదటిసారి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలా రియాక్ట్ అయ్యారో ఓ వీడియోను షేర్ చేసింది 'ఆర్ఆర్ఆర్' టీమ్. ట్రైలర్ చూసిన వెంటనే రామ్ చరణ్.. రాజమౌళిని చాలా గట్టిగా హత్తుకున్నాడు. ఎన్టీఆర్ కూడా వెళ్లి వారిద్దరినీ కౌగిలించుకున్నాడు. 'ఏంటి అది.. అసలు ఏంటి అది..? ఇప్పుడు ఉంటాది ఆగండి ఒక్కొక్కరికీ అంటూ' ఎన్టీఆర్ డైలాగ్స్ కొడుతూ కనిపించారు. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా అనే డైలాగ్ కి గూస్ బంప్స్ వచ్చాయని అన్నారు ఎన్టీఆర్. ఆ తరువాత రామ్ చరణ్ వెళ్లి రమా రాజమౌళి కూడా ప్రేమగా దగ్గర తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇక ఈ సినిమాలో అలియా భట్‌, ఓలివియా మోరిస్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్‌ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు.అందులో 'నాటు నాటు' పాటలో హీరోలు ఇద్దరు వేసిన స్టెప్పులకు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత.