Rakesh Master: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(55) అకస్మాత్తుగా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం ఉదయం ఆయనకు రక్త విరేచనాలు కావడంతో హైదరాబాద్ గాంధీ అసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. కొరియోగ్రాఫర్ గా రాకేష్ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఇప్పుడున్న శేఖర్, జానీ మాస్టర్లు ఆయన శిష్యులే. కొన్నాళ్ల నుంచి ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ మళ్లీ వార్తల్లోకి వచ్చారు రాకేష్ మాస్టర్. గతంలో ఆయన శిష్యుడైన శేఖర్ మాస్టర్ తో ఉన్న విభేదాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారాయన. తను చనిపోతే తన శవాన్ని కూడా శేఖర్ చూడటానికి వీల్లేదని అన్నారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తర్వాత రాకేష్ మాస్టర్ వ్యాఖ్యలపై శేఖర్ మాస్టర్ స్పందించారు కూడా. కానీ ఇప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోవడంతో ఆయన అప్పట్లో అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకనివ్వద్దు: రాకేష్ మాస్టర్
గతంలో రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ తో తనకున్న విభేదాల గురించి చెప్పుకొచ్చారు. తను కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పుడు తన శిష్యులు అంతా తన వద్దే ఉండేవారని చెప్పారు. అలా శేఖర్ కూడా తన వద్దే ఉండేవాడని అయితే తనకు పెళ్లి తర్వాత అది తన భార్యకు నచ్చేది కాదని రోజూ గొడవలు అయ్యేవని చెప్పారు. దీంతో ఆమె గొడవపడి వెళ్లిపోయిందని అన్నారు. శేఖర్ కు పెళ్లి కూడా తానే చేశానని అన్నారు. కానీ ఓ ఇంటర్వ్యూలో శేఖర్ తన గురించి తక్కువ చేసి మాట్లాడాడని, తన గురువు ప్రభుదేవా అని చెప్పడం తనకు ఎంతో బాధకలిగించిందన్నారు. కన్నబిడ్డలా చూసి పెళ్లి చేస్తే తర్వాత తనను పక్కన పెట్టాడని వాపోయారు. కనీసం శేఖర్ కూతురి పుట్టిన రోజు కి కూడా తనకు చెప్పలేదని, బాధేసి ఫోన్ చేస్తే వాళ్ల ఆవిడ ఫోన్ ఎత్తి ‘ఏంటీ నీకు అన్నీ చెప్పాలా’ అని అందని అన్నారు. ఆ శేఖర్ ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అని, తను చనిపోతే వాడు తన శవాన్ని కూడా తాకడానికి వీల్లేదని అన్నారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
నా తల్లిని తిట్టాడు, ఆయన వల్లే నాకు అవకాశాలు రాలేదు: శేఖర్ మాస్టర్
రాకేష్ మాస్టర్ ఈ వ్యాఖ్యలు చేసిన కొన్నాళ్లకు ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న విభేదాలపై స్పందించారు శేఖర్ మాస్టర్. తనకూ రాకేష్ మాస్టర్ కు మధ్య విభేదాలు ఏమీ లేవని, అయితే ఓ రోజు తాగి తన తల్లిని తిట్టాడని అన్నారు. అలా చాలా సార్లు అన్నాడని తనకు చాలా బాధనిపించి ఆయనతో మాట్లాడం మానేశానని అన్నారు. అసలు తమ మధ్య ఏం జరిగిందో గొడవ జరిగినపుడు అక్కడ ఉన్న వాళ్లకు మాత్రమే తెలుసన చెప్పారు. రాకేష్ మాస్టర్ వల్లే తనకు అవకాశాలు రాలేదని, తనకు మొదటి అవకాశం వినయ్ అనే ఆయన ద్వారా వచ్చిందని చెప్పారు. తన కోసం భార్యను వదల్లేదని, వాళ్లకి వేరే గొడవలు అయ్యాయని, ఆ విషయాన్ని తన భార్య కి ఫోన్ చేసి అడిగితే చెప్పిందని చెపుకొచ్చారు. శిష్యులను బాగా చూసుకుంటే ఎవరు వెళ్లిపోతారని, రాకేష్ చెప్పినవన్నీ అబద్దాలేనని చెప్పుకొచ్చారు. రాకేష్ మాస్టర్ చనిపోవడంతో అప్పట్లో ఆయన అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also: కషాయం పేరుతో విషం ప్రయోగం, జేడీ చక్రవర్తి హత్యకు కుట్ర!