Nandyala Crime: వైఎస్సార్సీపీ నాయకుడిపై అత్యాచారయత్నం కేసు నమోదైంది. నంద్యాల జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డిపై పోలీసులు అత్యాచారయత్నం కేసు నమోదు చేశారు. అన్నవరం ఎంపీటీసీగా ఉన్న గోపాల్ రెడ్డి.. అత్యాచారయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాల్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లా అవుకు మండలం అన్నవరం ఎంపీటీసీగా ఉన్నారు. అంతే కాకుండా గోపాల్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే ఎంపీటీసీ గోపాల్ రెడ్డి బలగానపల్లె శాసన సభ్యుడు రామిరెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉంటారని స్థానిక నాయకులు చెబుతున్నారు. ఓ వైసీపీ నాయకుడిపై అత్యాచారయత్నం కేసు నమోదు కావడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నాయకులు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని, వారి రౌడీయిజానికి సాధారణం జనం అల్లాడిపోతున్నారని ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు చేస్తారు. తప్పు చేసిన వైసీపీ నాయకులను కఠినంగా శిక్షించాలని, అలాగే పదవుల నుంచి తొలగించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కావలిలో రెచ్చిపోయిన వైసీపీ నేత!
నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నాయకుడు రెచ్చిపోయాడు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ నలుగురితో కలిసి వచ్చి జులుం ప్రదర్శించాడు. తన అనుచరులతో మహిళపై దాడి చేయించాడు. వైసీపీ నేత మహేంద్రు దగ్గర కరకమిట్ల పార్వతి అనే మహిళ ఏడాది క్రితం రూ. 50 వేలు అప్పుగా తీసుకుంది. ఈ మొత్తానికి అసలుతో పాటు వడ్డీ కింద మరో రూ. 50 వేలు కూడా చెల్లించినట్లు పార్వతి చెబుతోంది. అయితే మరో రూ. 65 వేలు వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ యువకులతో కలిసి వైసీపీ నేత దాడి చేయించాలని పార్వతి ఆరోపించారు. మహేంద్రు జులుంపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు వెళ్తే వాళ్లెవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో పార్వతి పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు బాధితురాలి బంధువులు తెలిపారు. ఆమెను వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో పార్వతి చికిత్స పొందుతున్నారు. ఈ విషయం గురించి ఆమెను మీడియా ప్రశ్నించింది. వైసీపీ నేత మహేంద్రు తన అనుచరులతో వచ్చి తనపై దాడి చేయించాడని చెప్పుకొచ్చింది. నన్ను ఎవరూ ఏమీ చేయలేరని, పోలీసులు కూడా మేం చెప్పినట్టే వింటారని, దిక్కున్న చోట చెప్పుకోమని మహేంద్రు దాడి చేశాడని పార్వతి బోరున విలపిస్తూ సమాధానమిచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పార్వతి నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద వైసీపీ నేత మహేంద్రుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.