భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంచి వాక్ చాతుర్యం కలిగిన నాయకుడు. ఆయన మాటలు అందర్నీ ఆలోచించేలా ఉంటాయి. విమర్శలకు, వివాదాలకు దూరంగా ఉండే నాయకుల్లో వెంకయ్య నాయుడు పేరు ముందు ఉంటుంది. అలాంటి నాయకుడిపై సూపర్ స్టార్ రజనీకాంత్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడుకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు అంతగా ఇష్టం లేదని అన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రజనీ అన్న మాటలు చర్చనీయాంశమైయ్యాయి. ఈ వార్త ప్రస్తుతం అటు రాజకీయంగానూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. 


ఇంతకీ ఏం జరిగిందంటే..


ఇటీవల  చెన్నై లోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేసన్ రజతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇద్దరూ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ వెంకయ్యనాయుడు పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు కి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు అంతగా నచ్చలేదన్నారు. ఆయన ఇంకా కొన్ని రోజులు కేంద్ర మంత్రి పదవి లో కొనసాగి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి నాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారు అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి గా ఉంటే బాగుండేదని, ఉప రాష్ట్రపతి పదవికి ఎలాంటి అధికారాలు ఉండవంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన రాజకీయంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారని, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త నుంచి రాజకీయాల్లోకి వచ్చి గొప్ప నాయకుడిగా ఎదిగారని అన్నారు. కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతి గా చేసి ఆయన రాజకీయాల నుంచి త్వరగా దూరమయ్యారని వ్యాఖ్యానించారు. 


మూత్రపిండాల సమస్య వల్లే..


ఈ సందర్బంగా రజనీకాంత్ తాను రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారో చెప్పారు. తాను మూత్రపిండా సమస్య వల్లే రాజకీయాలకు దూరం అవ్వాల్సి వచ్చిందన్నారు రజనీ. తను చికత్స పొందుతున్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని, అయితే డాక్టర్లు బహిరంగ సభల్లో పాల్గొనకూడదు అని చెప్పారని అందుకే తాను దూరంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఇవన్నీ చెప్తే భయపడుతున్నాడు అంటారని అందుకే ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదని చెప్పుకొచ్చారు రజనీ. 


రజనీకాంత్ మంచి నటుడు: వెంకయ్య నాయుడు


ఇదే కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. ఈ సందర్బంగా సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి పలు వ్యాఖ్యలు చేశారాయన. రజనీ కాంత్ మంచి నటుడని అన్నారు. రజనీ కాంత్ రాజకీయాల్లోకి వస్తారని తెలిసినపుడు వద్దని చెప్పానని అన్నారు. ఆరోగ్యం బాగుండాలంగే రాజకీయాలకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చానని చెప్పారాయన. ప్రజలకు సేవ చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయని, రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని చెప్పానన్నారు. అయితే తాను రాజకీయాల్లోకి వచ్చేవారిని నిరుత్సాహపరచడం లేదన్నారు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని అన్నారు. రాజకీయాలకు యువత అవసరం చాలా ఉందన్నారు. క్రమశిక్షణ, అంకిత భావం, నిజాయితీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్నారు. అప్పుడే మంచి చేయగలమని చెప్పారు.