‘RRR’ బాటలోనే ‘రాధేశ్యామ్’ కూడా వెళ్తుందని, సంక్రాంతి బరి నుంచి తప్పకుంటుందని వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఊహించినట్లే యూవీ క్రియేషన్స్ సంస్థ ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని వాయిదా వేసింది. అయితే, ఈ ప్రకటన చూసి ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోలేదు. పైగా.. ఇది మాకు ముందే తెలుసంటూ.. ఆ సంస్థను ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్‌తో ఆడేసుకుంటున్నారు. 


‘రాధేశ్యామ్’ కూడా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇటీవలే ఆ చిత్రబృందం స్పష్టం చేసింది. ఇంతలోనే మనసు మార్చుకున్నారో ఏమో.. బుధవారం ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే ఈ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ.. చిత్రం వాయిదాపై మంగళవారమే హింట్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులకు కూడా అసలు విషయం అర్థమైపోయింది. ‘‘ఒమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నాం’’ అని చెప్పగానే.. ఇక ఫ్యాన్స్ మీమ్స్‌తో తమ ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. 


ఒక వైపు ఒమిక్రాన్ కేసులు.. మరోవైపు ఏపీలో సినిమా థియేటర్ టికెట్ల ధరలు టాలీవుడ్‌ను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీలకు దేశవ్యాప్తంగా తమ చిత్రాన్ని విడుదల చేయాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ నెల 7న ‘ఆర్ఆర్ఆర్‌’తో పండుగ చేసుకుందామని భావించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు నిరాశే ఎదురైంది. రాజమౌళి సినిమాలంటే ‘వాయిదా’ సాధారణమేనని అంతా లైట్ తీసుకున్నారు. ఇక ప్రభాస్ అభిమానులైతే.. అప్‌డేట్స్ ఇవ్వడంలో యూవీ ఎప్పుడూ లేటుగానే ఉంటుందని, చివరి సినిమాను కూడా టైమ్‌కు విడుదల చేస్తుందనే నమ్మకం తమకి ముందు నుంచి లేదని అభిమానులు అంటున్నారు. తమ ఆవేదనను ఇలా మీమ్స్, కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు.