The Boogeyman: సినిమా రంగంలో ఎక్కువ శాతం మంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే సినిమాల్లో హారర్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ హారర్ సినిమాలను ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలు, యూత్ ఎక్కువగా దెయ్యాల సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. హారర్ సినిమాలకు భాషతో కూడా సంబంధం పెద్దగా ఉండదు. సినిమా భయానకంగా ఉందంటే చాలు ఎగబడి చూసేస్తుంటారు. ప్రతీ ఏటా చాలా హారర్ సినిమాలు అన్ని భాషల్లోనూ విడుదల అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని సూపర్ హిట్ అవుతాయి కూడా. అయితే ఒక్కోసారి హారర్ సినిమా మేకర్స్ మూవీ ను పబ్లిసిటీ చేసుకోవడం కోసం ‘డేర్ టూ వాచ్ ఇట్ ఎలోన్’ లాంటి కాంటెస్ట్ లను పెడుతూ ఉంటారు. అర్థరాత్రి ఒంటరిగా థియేటర్ లో కూర్చొని సినిమా చూడాలని, అలా దైర్యంగా మూవీ చూసిన వాళ్లకు బహుమతులు కూడా అందిస్తుంటారు. గతంలోనూ ఇలాంటి ప్రచార కార్యక్రమాలు జరిగాయి. తాజాగా హాలీవుడ్ హారర్ సినిమా ‘ది బూగీ మాన్’ మూవీ టీమ్ అలాంటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. 


‘ది బూగీ మాన్’ ఒంటరిగా చూస్తే రూ.5 వేలు బహుమతి..


‘ది బూగీ మాన్’ సినిమాను రాబ్ సావేజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 2 న విడుదల చేయనున్నారు. మల్టీప్లెక్స్ చైన్ PVR సినిమాస్ ఈ సినిమా ప్రమోషన్ కోసం డేర్ టు వాచ్ అలోన్ అనే ప్రత్యేక పోటీని ప్రకటించింది. ఈ మేరకు పివిఆర్ సంస్థ ట్విట్టర్ లో ప్రత్యేక ట్వీట్ ను చేసింది. అర్థరాత్రి పివిఆర్ థియేటర్ లో ‘ది బూగీ మాన్’ సినిమాను చూడాలని సవాల్ వదిలింది. అంతే కాదు ధైర్యంగా ఈ సినిమాను చూసిన వారికి రూ.5 వేల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించింది. 


షరతులకు అంగీకరిస్తేనే పోటీలో పాల్గొనే అవకాశం..


‘ది బూగీ మాన్’ డేర్ టూ వాచ్ ఇట్ ఎలోన్ పోటీలో పాల్గొనాలకునే వాళ్లు పివిఆర్ ట్విట్టర్ హ్యాండిల్ లో ‘ది బూగీ మాన్’ సినిమాను ఎందుకు చూడాలి అనుకుంటున్నారో చెప్పాలి. అలా కామెంట్లు చేసిన వారిలో నుంచి థియేటర్ లో ఒంటరిగా చూసే విజేతను ఎంపిక చేస్తారు. ఆ ఎంపిక అయిన వ్యక్తి పివిఆర్ లో ఒంటరిగా సినిమాను చూడాలి. అయితే ఎక్కడ ఏ స్క్రీన్ లో చూడాలి అనేది సంస్థదే తుది నిర్ణయం. ఈ ప్రమోషన్స్ లో పాల్గొనేవారికి ఎలాంటి అదనపు పరిహారం ఇవ్వబడదు. షరతులకు అనుమతిస్తేనే పోటీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే సినిమా చూసేటపుడు ప్రమోషన్స్ కోసం ఫోటో, వీడియోలు రికార్డు చేస్తారు దానికి పోటీలో పాల్గొనే వ్యక్తి అంగీకరించాలి. పై విధంగా షరతులకు లోబడే ఈ పోటీలో పాల్గొనాల్సి ఉంటుందని పివిఆర్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. ఇక ఈ భయానకమైన సినిమాకు రాబ్ సావేజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సోఫీ థాచర్, క్రిస్ మెస్సినా, వివియన్ లైరా బ్లెయిర్ మరియు డేవిడ్ దస్తమల్కియన్ నటించారు. సినిమా నిడివి దాదాపు 99 నిమిషాలు. ఇది 1973లో స్టీఫెన్ కింగ్ రాసిన చిన్న కథ ఆధారంగా రూపొందించబడింది.





Also Read: వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్?