KCR :  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. 2014 జూన్‌ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018 డిసెంబర్‌ 13న రెండోసారి ప్రమాణం చేశారు. అయితే.. 2023 జూన్‌ 2తో తొమ్మిదేండ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ గులాబీ దళపతి సీఎం కేసీఆర్‌కు మరో ఖ్యాతి దక్కనుంది.   రెండు సార్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్‌  .. ఏకబిగిన 9 ఏళ్ల పాటు- పాలించిన తెలుగు సీఎంగా కేసీఆర్‌ జూన్‌ 2తో రికార్డు సాధించనున్నారు. ఇప్పటివరకు మొత్తం 24 మంది తెలుగు సీఎంలలో ఎవరికీ దక్కని కీర్తిని.. కేసీఆర్‌ సొంతం చేసుకున్నారు.                          


తెలంగాణను ఏకధాటిగా తొమ్మిది సంవత్సరాలు సీఎంగా పాలించడంతోపాటు- కేసీఆర్‌.. తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తున్నారు.  ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ట్రానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం 9ఏళ్ల పాటు  ముఖ్యమంత్రిగా ఉండటం ఇదే తొలి సారి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రానికి  సీఎంలుగా పనిచేసిన తెలుగువారిలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు టీ డీపీ నేత చంద్రబాబు నాయుడు పేరిట ఉంది. ఆయన మూడు విడతల్లో మొత్తం 13 ఏళ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రిగా కొనసాగింది మాత్రం 8ఏండ్ల 256 రోజులు మాత్రమే. 2004లో ఓడిపోయిన చంద్రబాబు పదేళ్ల తర్వాత అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఎన్నికయ్యారు. రెండు వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.         


స్వాతంత్య్రానికి పూర్వం మద్రాసు ప్రెసిడెన్సీ, మొన్నటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్‌ స్టేట్‌, నిన్నటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, నేటి తెలంగాణ, ఏపీ (విభాజిత) రాష్ర్టాల దాకా ఎక్కడ చూసినా, ఒక తెలుగు నాయకుడు గ్యాప్‌ లేకుండా, ఏకబిగిన, ఇంత సుదీర్ఘ కాలం, ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి.  ఒక రాష్ర్టానికి ఏకబిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరిట ఉన్న 8 ఏండ్ల 256 రోజుల రికార్డును, ఈ జూన్‌ 2తో అధిగమించి, మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేండ్ల 221 రోజులు, నారా చంద్రబాబునాయుడు ఎనిమిదేండ్ల 256 రోజులు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఐదేండ్ల 111 రోజులు పదవిలో కొనసాగారు. వీరందరి కంటే ఎక్కువగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ జూన్‌ 2తో సరిగ్గా తొమ్మిది ఏండ్లను పూర్తి చేసుకోబోతున్నారు.                                    


2001 నుంచి 2014 దాకా 13 ఏండ్ల పాటు తెలంగాణ సాధన కోసం ఉద్యమం నడిపిన ఆయన, తాను సాధించుకొచ్చిన తెలంగాణలో 2014 నుంచి నేటి దాకా అభివృద్ధి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి మరోసారి సీఎం అవుతారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.