సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద కాన్సెప్ట్ లతో సినిమాలను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బోల్డ్, వయిలెంట్ కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారాయన. ఈసారి లెస్బియన్ డ్రామాను రూపొందించి వార్తల్లో నిలిచారు. అప్సరా రాణి, నైనా గంగూలీలను హీరోయిన్లుగా పెట్టి 'డేంజరస్' అనే సినిమాను తెరకెక్కించారు. ఇండియాలో తొలి లెస్బియన్ సినిమాగా 'డేంజరస్' విడుదల కాబోతుంది. 


మొదటి నుంచి కూడా ఇద్దరి అమ్మాయిల రొమాన్స్ ను హైలైట్ చేస్తూ ప్రచార చిత్రాలను విడుదల చేశారు వర్మ. ట్రైలర్ ను కూడా ఎంతో బోల్డ్ గా కట్ చేశారు. ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో వర్మకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాను స్క్రీనింగ్ చేయడానికి పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ తిరస్కరించాయి. 


ఈ విషయాన్ని వర్మ స్వయంగా వెల్లడించారు. లెస్బియన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన 'డేంజరస్' సినిమాను పీవీఆర్, ఐనాక్స్ తమ థియేటర్లలో ప్రదర్శించడానికి అంగీకరించడం లేదని రాసుకొచ్చారు. సుప్రీం కోర్టు సైతం ఎల్జీబీటీ కమ్యూనిటీని గౌరవిస్తూ చట్టంలో మార్పు తీసుకొచ్చిందని.. సెన్సార్ బోర్డ్ కూడా తన సినిమాని పాస్ చేసిందని కానీ ఇప్పుడు పీవీఆర్, ఐనాక్స్ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే.. వారి మేనేజ్మెంట్ కి ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే ఎంత చిన్నచూపో అర్ధమవుతుందని రాసుకొచ్చారు. 


ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఈ సినిమా రిలీజ్ కోసం పోరాడతామంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు యూట్యూబ్ లో రిలీజ్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారు. మరి వర్మ ఏం చేస్తారో చూడాలి! 


Also Read: మొన్న శ్రీవల్లి ఇప్పుడు అఫ్రీన్ - రష్మిక వేరియేషన్స్ మాములుగా లేవు