అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న 'పుష్ప 2' సినిమా పట్టాలెక్కడానికి సిద్ధమైంది. 'పుష్ప ది రూల్' అంటూ తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పై చాలా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు 'పుష్ప ది రూల్' కి ముహూర్తం కుదిరింది. ఆదివారం సినిమా షూటింగ్ పనులు ప్రారంభించింది మూవీ టీమ్. పుష్ప సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లా బ్రోజెక్ షేర్ చేసిన ఫొటో చూస్తుంటే సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది. అడ్వెంచ‌ర్ హాజ్ బిగెన్ అంటూ అల్లు అర్జున్‌తో క‌లిసి ఉన్న ఓ ఫొటోను మిరోస్లా బ్రోజెక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


ఈ ఫోటోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎనర్జిటిక్ లుక్ లో కనిపిస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబో లో వచ్చిన 'పుష్ప ది రైస్' సినిమా పాన్ ఇండియా లెవల్ లో ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్, పాటలు, డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. 'చూపే బంగారామాయేనా' లాంటి సాంగ్స్ అందరితో స్టెప్పులేయించాయి. సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన 'తగ్గేదేలే' అనే డైలాగ్ దేశవ్యాప్తంగా ఎంత మంది అనుకరించారో చూశాం కూడా. గ‌తేడాది విడుద‌లైన పుష్ప పార్ట్ -1 బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. తెలుగు, హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో భారీ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుందీ సినిమా. 


పుష్ప -1 అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత పుష్ప - 2 కు సంబంధించి త్వరలోనే షూటింగ్ కు వెళ్లనున్నట్లు గతంలో ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే, ఎట్టకేలకు పుష్ప-2 సెట్స్ పైకి వచ్చింది. ఇక పుష్ప-2 లో పుష్పరాజ్ ఎలా రూల్ చేశాడు, అతనికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి, భన్వర్ సింగ్ షకావత్ ఏం చేశాడు అనే ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ ఇందులో చూపించబోతున్నారు సుకుమార్. మూవీ రెగ్యులర్ షూటింగ్ ని హైదరాబాద్ లో ప్రారంభించి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేస్తారట. తరువాత సినిమా బృందం రెండు నెలల పాటు బ్యాంకాక్ లో షూటింగ్ పనులు పూర్తి చేసుకొని, తిరిగి వచ్చాక మారేడుమిల్లి అడవుల్లో సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. ప్రస్తుతం హీరో, హీరోయిన్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట మూవీ టీమ్. 


ఇక 'పుష్ప ది రూల్' సినిమా పై అటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. హిందీ లో కూడా ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఫాహద్‌ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి భాగానికి మ్యూజిక్ అందిందంచిన దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు.