రెండు తెలుగు రాష్ట్రాల్లో 'భీమ్లానాయక్' హడావిడి మొదలైంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లు, థియేటర్ల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు చర్చనీయాంశంగా మారింది. జీవో నెంబర్ 35 ప్రకారమే సినిమాను ప్రదర్శించాలని.. అదనపు షోలు వేసినా.. అధిక ధరలకు టికెట్లు అమ్మినా థియేటర్లను సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేశారు అధికారులు.
అలానే పోలీసులతో పాటు రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులను 'భీమ్లానాయక్' థియేటర్లకు పంపి నిబంధనలను సరిగ్గా అమలు చేస్తున్నారో లేదోనని తనిఖీలు చేపట్టేలా చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మీడియాలో మాట్లాడారు. ఇది సినిమా నిర్మాతలు, ఆర్టిస్ట్ ల మీద జరుగుతున్న దాడి కాదని.. థియేటర్ వ్యవస్థ మీద జరుగుతోన్న దాడి అని అన్నారు.
ఈ రాష్ట్రంలో థియేటర్లు ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. పవన్ పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలి కానీ ఇలా థియేటర్లపై ఆంక్షలు విధించడం వలన ఎగ్జిబిటర్ల వ్యవస్థకు నష్టం కలుగుతుందని అన్నారు. థియేటర్లపై చేస్తోన్న దాడి కరెక్ట్ కాదని.. రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఎలా మీ వాళ్లు అవుతారో.. ఇక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు కూడా మీవాళ్లే అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ అన్నారు.
ఇది పవన్ కళ్యాణ్ పై లేదా నిర్మాతలపై దాడి కాదని.. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి వారిని థియేటర్ల వద్ద కూర్చోబెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన మూడు కరోనాల వలన బాగా ఇబ్బందులు పడ్డామని.. దానికంటే ఎక్కువగా ఇప్పుడు ఎగ్జిబిటర్ల వ్యవస్థపై దాడి చేస్తున్నారని అన్నారు. 10 గంటల వరకు షో వేయొద్దని నోటీసులు ఇస్తే.. దానికి అనుగుణంగానే ఉన్నామని.. అందరం జీవోని ఫాలో అవ్వాల్సిందేనని అన్నారు. అయినప్పటికీ.. అధికారులు మళ్లీ థియేటర్లపై దాడి చేస్తూ మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారని బాధపడ్డారు.
ఏపీలో ఉన్న సినిమా ఎగ్జిబిటర్లను ఏం చేయాలనుకుంటున్నారో.. ఓపెన్ గా చెప్పేయండి అంటూ ప్రభుత్వాన్ని కోరారు. పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలనుకుంటే అది మీ వ్యక్తిగతమని.. కానీ ఇలా థియేటర్ వ్యవస్థపై దాడి చేయడం కరెక్ట్ కాదని అన్నారు. థియేటర్ల ఓనర్లు ఏం చేశారని.. మీరిలా చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది పవన్ కళ్యాణ్, 'భీమ్లానాయక్' సినిమాపై దాడి కాదని.. థియేటర్ల మీద దాడి అని అన్నారు. ఈ దాడుల వలన పవన్ కళ్యాణ్ కి ఎలాంటి నష్టం ఉండదని.. థియేటర్ల వ్యవస్థకు నష్టమని చెప్పుకొచ్చారు.