తమ దర్శకులకు విలువైన బహుమతులు ఇవ్వడం కొందరు హీరోలకు,నిర్మాతలకు అలవాటు. ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా చాలా మంది స్టార్ హీరోలు తమకు భారీ విజయాలను అందించిన దర్శకులకు గతంలో కాస్ట్లీ గిఫ్ట్ లు ఇచ్చారు. అలానే మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా తమతో కలిసి పని చేసిన డైరెక్టర్లకు ఖరీదైన బహుమతులు ఇచ్చారు. అప్పట్లో నిర్మాత బండ్ల గణేష్.. పూరి జగన్నాధ్ కి లక్షల విలువ చేసే లైటర్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. 


సాధారణంగా అయితే సినిమా రిలీజై సక్సెస్ అందుకున్న తరువాత ఇలా కానుకలు ఇస్తుంటారు. కానీ ఇప్పుడొక నిర్మాత సినిమా రిలీజ్ కి ముందు తన దర్శకుడికి లగ్జరీ కారుని బహుమతిగా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రవితేజ హీరోగా 'ఖిలాడి' అనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు రమేష్ వర్మ. ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన 'ఫుల్ కిక్కు' సాంగ్ మిలియన్ల వ్యూస్ ను సాధించింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి కంటే రూ.15 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇది కాకుండా.. నాన్ థియేట్రికల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ ఎలానూ ఉంటాయి. 


కరోనా సమయంలో ఈ సినిమాకి రూ.40 కోట్ల ఆఫర్ వచ్చింది. కానీ నిర్మాతలు తమ సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్లే బిజినెస్ కూడా జరగడంతో నిర్మాత కోనేరు సత్యనారాయణ కోటిన్నర విలువైన రేంజ్ రోవర్ కారుని తన దర్శకుడికి గిఫ్ట్ గా ఇచ్చారు.