భారత టెలివిజన్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ధారావాహిక ‘మహాభారత్’. ఇందులో నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తీ.. భీముడి పాత్రలో జీవించారు. భీముడంటే.. అందరికీ ఆయనే గుర్తుకొచ్చేంతగా పాత్రలో ఒదిగిపోయారు. 75 ఏళ్ల ప్రవీణ్ సోబ్తీ.. సోమవారం గుండెపోటుతో మరణించారనే వార్త ప్రేక్షకులను విషాదంలో ముంచింది. ప్రవీణ్ కుమార్తె నికునికా మంగళవారం మీడియాకు ఈ బ్యాడ్ న్యూస్ తెలియజేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ప్రవీణ్ గుండెపోటుతో కన్నుమూశారని ఆమె వెల్లడించారు.
BR చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహాభారత్’ ధారావాహిక 1988 నుంచి 1990 వరకు ప్రసారమైంది. ఇందులో ప్రవీణ్.. భీముడి పాత్రలో ఒదిగిపోయారు. చివరికి ఆ పాత్రే ఆయన ఇంటి పేరైంది. పంజాబ్‌కు చెందిన ప్రవీన్ కుమార్ సోబ్తీ.. కేవలం నటుడు మాత్రమే కాదు.. హ్యామర్, డిస్క్‌త్రోలో కూడా ఛాంపియన్. ఆయన హాంకాంగ్‌లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో ఇండియాకు అనేక పతకాలను సాధించారు. బంగారు పతకంతో విజేతగా నిలిచారు. ఆయన ఒలింపిక్స్‌లో దేశానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ‘మహాభారత్’ సీరియల్‌లోకి రాకముందే ఆయన 1960-70 కాలంలో అథ్లెటిక్స్‌లో పాపులర్ అయ్యారు. అంతేకాదు, ఆ సీరియల్‌లో నటించడానికి ముందే ప్రవీణ్ 30 పైగా సినిమాల్లో నటించారు. ప్రవీణ్ బీఎస్ఎఫ్(Border Security Force-BSF)లో డిప్యుటీ కమాండెంట్‌గా పనిచేశారు.
ప్రజలు ఆయన అసలు పేరు కంటే.. భీమాగానే ఎక్కువగా గుర్తుంచుకున్నారు. 1990లో కమల్‌హాసన్ నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘మైఖెల్ మదన్ కామరాజు’ సినిమాలో బాడీగార్డ్ భీమ్‌గా ప్రవీణ్ నవ్వులు పూయించారు. ఆ సీన్ ఇక్కడ చూడండి.
2013లో ప్రవీణ్ కుమార్ సోబ్తి రాజకీయాల్లో చేరారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై ఢిల్లీలోని వజీర్‌పూర్ నుంచి పోటీ చేశారు. కానీ, ఆయన్ని విజయం వరించలేదు. ఆ తర్వాత ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2013లో ‘మహాభారత్ ఔర్ బార్బారిక్’ సినిమా తర్వాతే మరే చిత్రంలోనూ నటించలేదు. అదే ఆయన ఆఖరి మూవీ. చిత్రం ఏమిటంటే.. ఆ సినిమాలో కూడా ఆయన భీముడి పాత్రే పోషించారు.