Prasanth Varma About Hanuman Movie Release Date: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. చేసింది తక్కువ సినిమాలే అయినా, తనదైన ముద్ర వేసుకున్నారు. ఒక్కో సినిమాను ఒక్కో జానర్ లో తెరకెక్కిస్తూ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘హనుమాన్‘. ‘జాంబిరెడ్డి’ తర్వాత తేజ సజ్జ  ప్రశాంత్‌వర్మ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సోషియోఫాంటసీ కథాంశంతో సూపర్‌ హీరో చిత్రంగా దీనిని తీర్చిదిద్దారు. నిరంజన్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, అమృతా అయ్యర్‌, వినయ్‌ రాయ్‌, రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


‘హనుమాన్’ విడుదల ఎందుకు వాయిదా వేయలేదంటే?


తాజాగా ‘హనుమాన్‘ సినిమా విడుదల గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమా వాయిదా వేస్తున్నట్లు చాలా ఊహాగానాలు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ తాము అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమలో మంచి బిజినెస్ జరుగుతుంది. ప్రతి సంక్రాంతికి కామన్ గా మూడు పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. ఈసారి మాత్రం ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. ఐదు చిత్రాల వరకు విడుదల అవుతున్నాయి. టాలీవుడ్ లో బాగా పోటీ పెరిగింది. ‘హనుమాన్‘ మూవీతో పాటు మహేష్ బాబు ‘గుంటూరు కారం‘ జనవరి 12న విడుదల అవుతుంది. చాలా మంది మా సినిమా విడుదల వాయిదా వేయాలని కోరారు. మాకు అవకాశం ఉంటే కచ్చితంగా పోస్ట్ పోన్ చేసేవాళ్లం. కుదరక అదే డేట్ న రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం. చాలా మంది నన్ను ఇగోయిస్ట్ అన్నారు. కానీ, ఎలాంటి ఇగో లేదు. హిందీ మార్కెట్‌ అనేది మా సినిమాకు చాలా ముఖ్యం. నార్త్‌ లో ‘హనుమాన్‘ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసేవాళ్లు, 2 నెలల కిందటే చూశారు. ఈ సినిమా మీద వాళ్లకు చాలా నమ్మకం ఉంది. జనవరి 12న విడుదల అంటూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ వాయిదాను వాళ్లు అస్సలు ఒప్పుకోలేదు. అందుకే మేం అనుకున్నట్లుగానే జనవరి 12న విడుదల చేస్తున్నాం” అని చెప్పారు.


దిల్ రాజుతో ఏం చెప్పానంటే?


అటు సంక్రాంతి బరిలో నిలిచే చిత్రాల దర్శక నిర్మాతలో దిల్ రాజు చర్చలు జరిపినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. ఆయన కూడా విడుదల వాయిదా వేసుకోమని సూచించినట్లు చెప్పారు. కానీ, వాస్తవ పరిస్థితి ఆయనకు వివరించినట్లు వెల్లడించారు. ‘హనుమాన్’ మంచి హిట్ అయితే, తనతో పాటు తెలుగు సినిమా పరిశ్రమకు మంచి పేరు వస్తుందని చెప్పినట్లు వివరించారు.  రీసెంట్ ‘హనుమాన్’ ప్రమోషన్ లో పాల్గొంటున్న ప్రశాంత్ వర్మ కీలక విషయాలను వెల్లడిస్తున్నారు. మున్ముందు ‘అవతార్’ లాంటి సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నట్లు వివరించారు. ‘హనుమాన్’ అనుకున్నట్లుగా సక్సెస్ అయితే, ఇక ఆయన ఫోకస్ ఆ స్థాయి సినిమాల మీదే ఉంటుందనే చర్చ జరుగుతోంది. 


Read Also: సంక్రాంతికి ఐదు, రిపబ్లిక్‌ డేకు నాలుగు - ఈ నెల అన్నీ క్రేజీ మూవీసే!