పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రబృందం. ఇప్పటికే టీమ్ మొత్తం ముంబై, చెన్నైలలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ లో ఓ ఈవెంట్ జరగబోతుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 


ఈ సందర్భంగా ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు 'రాధేశ్యామ్' సినిమా ఎలా ఉందో చెప్పుకొచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో వరుస ట్వీట్లు పెడుతున్నారు. 'రాధేశ్యామ్' సినిమా చూశానని.. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ప్రభాస్-పూజాహెగ్డేల కెమిస్ట్రీ బాగుందని.. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని అన్నారు. 


ఇదొక యూనిక్ సబ్జెక్ట్ అని.. ఒక్క మాటలో చెప్పాలంటే 'రాధేశ్యామ్' క్లాసిక్, స్టైలిష్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ అని అన్నారు. 'రాధేశ్యామ్' ఒక ఎపిక్ అని.. ప్రభాస్ అద్భుతంగా నటించారని.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ బాగుందని అన్నారు. ఇండియాలో ప్రభాస్ క్లాస్, స్టైల్ ను బీట్ చేసేవాళ్లే లేరంటూ పొగిడేశారు. గతంలో కూడా ఉమైర్ సంధు పలు సినిమాలకు ఇలా రిలీజ్ కి ముందే రివ్యూ ఇచ్చారు. అయితే అందులో కొన్ని సినిమాలో హిట్ అవ్వగా.. కొన్ని ఫ్లాప్ అయ్యాయి. 


అయితే ఇప్పుడు అతడు 'రాధేశ్యామ్' సినిమాపై చేసిన ట్వీట్ అంచనాలను పెంచేసింది. ఇప్పటికే సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ  సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. యూర‌ప్ నేప‌థ్యంలో జ‌రిగే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు.