వర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్ ఫిక్షన్ ఫిల్మ్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పవన్ కల్యాణ్ శుక్రవారం (సెప్టెంబరు 2) పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ గ్లాన్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇది చూసిన తర్వాత ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 


నిమిషం నిడివి ఉన్న ఈ పవర్ గ్లాన్స్‌లో.. పవర్ స్టార్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. మల్లయోధులతో పవన్ కల్యాణ్ కుస్తీకి సై అంటూ.. తొడగొట్టి మరీ పోరాటానికి దిగుతారు. మీసం మెలేస్తూ ఒక్కొక్కరినీ తన చేతులతో మట్టి కరిపిస్తారు. అలీవ్ గ్రీన్ కుర్తా పైజామా మెడ చుట్టూ ఎరుపు రంగు కండువాతో నడిచి వచ్చే ఆ సీన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. ఇక బ్యాగ్రౌండ్ లో వచ్చే ‘‘దిగొచ్చిండు భళ్ళు భళ్ళునా. పిడుగే దిగొచ్చింది భళ్లు భళ్లునా.. మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు ’’ అనే పాట మైండ్ నుంచి బయటకు పోదు. ఇంకెందుకు ఆలస్యం? హరిహర వీరమల్లు పవర్ గ్లాన్స్‌ను ఇక్కడ చూసేయండి. 



‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే విడుదల అయ్యాయి. ఆ తర్వాత పెద్దగా అప్ డేట్స్ ఏమీ లేవు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సినిమా యూనిట్ అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఆయన బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. తొలుత  వినాయక చవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ వెల్లడించింది. పవన్ పోస్టర్ కలిపి పవర్ గ్లాన్స్ కు టైం ఫిక్స్ చేసినట్లు సినిమా యూనిట్ ట్వీట్ చేసింది.


పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అనంతరం మెగా సూర్య ప్రొడక్షన్స్ మరో పోస్టర్ విడుదల చేసింది. ‘‘స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం’’ అంటూ క్యాప్షన్ పెట్టింది. యుద్ధ రంగంలో పవన్ కల్యాణ్ పోరాడుతున్నట్లుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. గుర్రం రథంతో ఆయన దూసుకెళ్తున్నారు. పవన్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ పోస్టర్ మీద హ్యాపీ బర్త్ డే అని రాశారు. తాజాగా పవర్ గ్లాన్స్ విడుదల సమయాన్ని సాయంత్రం 5.45 నుంచి ఉదయం 10.15కు మార్చింది సినిమా యూనిట్. పవన్ కు బర్త్ డే విషెస్ చెప్తూ విడుదల చేసింది.


హరిహర వీరమల్లు సినిమా పవర్ గ్లాన్స్ చూసి  పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పవర్ గ్లాన్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చర్చించుకుంటున్నారు. PowerGlance హ్యాష్ టాగ్ తో చర్చలు నడుపుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద  ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.


ప్రస్తుతం పవన్ ఈ సినిమా కాకుండా మేనల్లుడు సాయి తేజ్‌తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించే 'భవదీయుడు భగత్ సింగ్' కూడా చేయనున్నారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.