పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయి రాజకీయనాయకుడి పాత్ర పోషించాలనుకుంటున్నారు. 2024లో ఎన్నికలు జరగనున్నాయి. 2023లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. నిజానికి కరోనా థర్డ్ వేవ్, రష్యా ట్రిప్ వంటి కారణాలతో ఆయన సినిమాల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు మాత్రం వేగవంతగా సినిమాలు పూర్తి చేయాలనుకుంటున్నారు. 

 

సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న 'భీమ్లానాయక్' సినిమా దాదాపు పూర్తయినట్లే. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న 'హరిహర వీరమల్లు' సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టి ఏకధాటిగా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకి పవన్ నలభై రోజుల కాల్షీట్స్ కేటాయించనున్నారు. 

 

ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ సినిమాను మొదలుపెడతారు. దీనికి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాను రెండు నెలల్లో పూర్తి చేయాలని హరీష్ శంకర్ కి చెప్పారట పవన్ కళ్యాణ్. ఆ తరువాత డేట్స్ కేటాయించడం కుదరదని ముందే చెప్పేశారట. దీంతో దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు హరీష్ శంకర్. ఇప్పటికే కథ మొత్తం రెడీగా ఉంది కాబట్టి పవన్ రాగానే సెట్స్ పైకి వెళ్లిపోవడమే. పైగా హరీష్ శంకర్ సినిమాలను త్వరగా పూర్తి చేస్తారనే పేరుంది గనుక పవన్ పెట్టిన డెడ్ లైన్ లోపు సినిమాను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. 

 

ఈ రెండు సినిమాలే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్. దానికి కూడా 60 రోజులే కేటాయిస్తానని చెప్పారట. ప్రస్తుతం సురేందర్ రెడ్డి.. అఖిల్ హీరోగా 'ఏజెంట్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోగా పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్ ల సినిమాలకు పూర్తి చేసి.. సురేందర్ రెడ్డి సెట్స్ పైకి వస్తారు. ఆ విధంగా ఈ దాడిలో మూడు సినిమాలను పూర్తి చేయాలనుకుంటున్నారు పవన్. మరి ఆయన ఆశిస్తున్నట్లు దర్శకులు టైంకి సినిమాలను పూర్తి చేయగలరో లేదో చూడాలి!

 





 


 


 





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి