పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) 'భీమ్లా నాయక్' ఒక్కసారిగా లైనులోకి వచ్చింది. ఫిబ్రవరి 25న (Bheemla Nayak On 25th Feb) ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు నేడు (ఫిబ్రవరి 15, మంగళవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు) వెల్లడించింది. దీంతో ముగ్గురు యంగ్ హీరోలకు ఒక విధంగా షాక్ తగిలిందని చెప్పాలి. 'భీమ్లా నాయక్' వాయిదా పడిందనే సమాచారంతో 'గని', 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాలు ప్రచారం ప్రారంభించాయి. ఫిబ్రవరి 25న తమ సినిమాలు విడుదల చేసేలా వరుణ్ తేజ్, శర్వానంద్, కిరణ్ అబ్బవరం సన్నాహాలు చేశారు. మరి, 'భీమ్లా నాయక్' రాకతో ఆ సినిమాలు ఏమవుతాయో, వారు ఏం చేస్తారో చూడాలి.


ఫిబ్రవరి 25న తమ సినిమాను విడుదల చేయనున్నట్టు 'గని' యూనిట్ ప్రకటించిన రోజు రాత్రే 'భీమ్లా నాయక్' విడుదల తేదీ ప్రకటించడం గమనార్హం. 'గని'లో హీరోగా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ నటించారు. పైగా, ఆ సినిమా నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ. మరొకరు వరుణ్ తేజ్ స్నేహితుడు సిద్దు ముద్ద. అల్లు అరవింద్, 'భీమ్లా నాయక్' నిర్మించిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాను సితార మాతృసంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది. విడుదల తేదీల గురించి డిస్కస్ చేసుకోకుండా 'గని' విడుదల తేదీ ప్రకటించారా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అనే డిస్కషన్ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.



Also Read: పవన్ 'భీమ్లా నాయక్' వెనక్కి - ఈ నాలుగు సినిమాలూ ముందుకు







పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' వస్తే... 'గని', 'ఆడవాళ్ళు మీకు జోహార్లు', 'సెబాస్టియన్ పీసీ 524' వాయిదా పడతాయని ప్రచారం జరుగుతోంది. అజిత్ 'వలిమై' (ఫిబ్రవరి 24 విడుదల), ఆలియా భట్ 'గంగూబాయి కతియావాడి' (ఫిబ్రవరి 25 విడుదల) వాయిదా పడే అవకాశాలు లేవు. మరో విడుదల తేదీకి వెళ్ళడానికి అజిత్ సినిమాకు తమిళనాట ఇబ్బంది అయితే... అలియా భట్ సినిమాకు ఉత్తరాదిలో సమస్య వస్తుంది. వాయిదా వేయకుండా ఆ తేదీలకు వస్తే... తెలుగులో థియేటర్లు, కలెక్షన్ల విషయంలో 'భీమ్లా నాయక్' ప్రభావం (Bheemla Nayak Effect On Gangubai Kathiawadi and Valimai) ఉంటుంది. అదీ సంగతి!


Also Read: యష్, విజయ్, షాహిద్ ఫ్యాన్స్ హ్యాపీ! ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం నాట్ హ్యాపీ - ఎందుకంటే?


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటిస్తున్న 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. 


Also Read: మహేష్ బాబు రికార్డ్ బ్రేక్ చేసిన తమిళ స్టార్ విజయ్