అడివి శేష్ నటించిన 'మేజర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ 'మేజర్' టీమ్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఓ లెటర్ షేర్ చేశారు.
''ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై 'మేజర్'గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను.
ఈ చిత్ర కథానాయకుడు సోదరుడు అడివి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీశ్రీ అడివి బాపిరాజు గారి మనవడైన శ్రీ శేష్ సినిమాలో భిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి. తెలుగు సాహిత్యంపై మక్కువ.. వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సాహసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ శశికిరణ్ కు శుభాకాంక్షలు. ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను. 'మేజర్' చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో శ్రీ మహేశ్ బాబు గారికి, చిత్ర నిర్మాతలు శ్రీ శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజ్, శ్రీమతి రేవతి, సాయి మంజ్రేకర్, శోభిత ధూళిపాళ, మురళీ శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు'' అంటూ రాసుకొచ్చారు.
ఇది చూసిన అడివి శేష్ ఎమోషనల్ అయ్యారు. ''పవన్ కళ్యాణ్ గారు మీ ప్రేమతో నా హృదయం నిండిపోయింది.. మీరు టూర్ లో ఉండేసరికి 'మేజర్' సినిమా చూసే టైం ఉంటుందా..? అనుకున్నా. కానీ ఈ సినిమా గురించి మీరిచ్చిన నోట్ నిజంగా చాలా టచింగ్ గా ఉంది. ఆరోజు పంజా, ఈరోజు మేజర్.. మీ దయకు నిజంగా కృతజ్ఞతలు. ఇంకా ఎన్నో చెప్పాలి. అవన్నీ ఫోన్ లో చెబుతాను'' అంటూ రిప్లై ఇచ్చారు.
Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్
Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?