టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలంటే రైటర్లుగా పరుచూరి బ్రదర్స్ ఉండాల్సిందే. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ ఇలాంటి అగ్ర హీరోలతో కలిసి పని చేశారు పరుచూరి బ్రదర్స్. ఈజీ ఆఫీస్ లో ఉద్యోగం చేసే పరుచూరి వెంకటేశ్వరావు సినిమాలకు రచన చేసేవారు. ఆయన తమ్ముడు గోపాలకృష్ణ కూడా అన్నయ్యకు సాయం చేసేవాడు. వీరిద్దరికీ పరుచూరి బ్రదర్స్ గా నామకరణం చేసి ఇండస్ట్రీకి పరిచయం చేశారు నందమూరి తారక రామారావు. 


అప్పటినుంచి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ రైటర్స్ గామారారు . మూడు వందలకు పైగా సినిమాలను పని చేశారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి హిట్స్ అందుకున్నారు. అలానే కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా 'సన్నాఫ్ ఇండియా' సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. 


అయితే పరుచూరి వెంకటేశ్వరావు మాత్రం బయట పెద్దగా కనిపించడం లేదు. ఆయన వయసు ఎనభై ఏళ్లు. కొంతకాలంగా వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్య కూడా ఉన్నాయట. అయితే ఇటీవల దర్శకుడు జయంత్ సి పరాంజీ.. పరుచూరి వెంకటేశ్వరావుని కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 


'గురువు గారు వెంకటేశ్వరావు గారిని చూసి బాధపడ్డాను కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి ఎప్పటిలానే యాక్టివ్ గా ఉంది' అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ ఫొటోని చూసిన వారంతా షాకవుతున్నారు. పరుచూరి గారేంటి ఇలా అయిపోయారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'గురువు గారు ఏమైంది..?' అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వయసు మీద పడడంతో ఆయన ఇలా అయిపోయారని తెలుస్తోంది.