బాలీవుడ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు సతీష్ కౌశిక్ మరణవార్తను మరువకముందే బాలీవుడ్ లో మరో దర్శకుడు కన్నుమూశారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ప్రదీప్ సర్కార్(68) మరణించారు. గత కొంత కాలంగా ప్రదీప్ సర్కార్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఎప్పటికప్పుడు డయాలసిస్ చేయించుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆయన మార్చి 24 తెల్లవారుజామున 3:30 గంటల ప్రాతంలో ఆయన తుది శ్వాస విడిచారు.
ప్రదీప్ సర్కార్ మృతి విషయాన్ని నటి నీతూ చంద్ర ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తనకు ఇష్టమైన దర్శకుడు ప్రదీప్ సర్కార్ మరణ వార్త తనను ఎంతగానో బాధించిందని అన్నారు. తన సినీ కెరియర్ ఆయన సినిమాతోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. మరెందరో బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అలాగే ప్రదీప్ దాదా మృతిని జీర్ణించుకోలేకపోతున్నాననంటూ బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగణ్ అన్నారు. బాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రదీప్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు.
ప్రదీప్ సర్కార్ కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ‘పరిణీత’ సినిమాతో ఆయనకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ‘లగా చునారీ మే దాగ్’, ‘మర్దానీ’, ‘హెలికాప్టర్ ఈలా’ వంటి ఎన్నో హిట్ సినిమాలను ఆయన దర్వకత్వం వహించారు. ఆయన సినిమాల ద్వారా ఎంతో మంది బాలీవుడ్ నటీనటులను పరిచయం చేశారాయన. ఎంతో మంది సీనియర్ నటీనటులతో ఆయనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన్ను బాలీవుడ్ లోకం ముద్దుగా దాదా అని పిలుస్తుంది.
ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉంటారు ప్రదీప్. అందుకే ఆయన్ను ఎంతో మంది బాలీవుడ్ నటీనటులు అభిమానిస్తారు. ప్రదీప్ సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోలు చేసేవారు. అంతేకాదు వాణిజ్య ప్రకటనల దర్శకత్వం వహించేవారు. 2005 లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్ లో దర్శకుడిగా పరిచయం అయ్యారు ప్రదీప్. తన మొదటి సినిమాతోనే బీ టౌన్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడ తిరుగలేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ మూవీలో విద్యా బాలన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్ నటించారు. ఈ సినిమా తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు ప్రదీప్. ప్రదీప్ సర్కార్ మృతితో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రదీప్ మృతి పట్ల అభిమానులు, బాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.