Pareshan : 'మసూద' సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమైన తిరువీర్.. ఇప్పుడు తెలంగాణ మాండలికంలో రూపొందించిన సినిమాతో కామెడీ పంచడానికి వస్తున్నాడు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తోన్న ఈ చిత్రానికి 'పరేషాన్' అనే టైటిల్ ను ఇప్పటికే ఖరారు చేయగా.. ఈ సినిమాకు రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.


ఇక 'పరేషాన్' ట్రైలర్ ను గనక పరిశీలిస్తే.. తిరువీర్ తండ్రి పరీక్షలలో అతని మార్కుల గురించి ఉపన్యాసం ఇవ్వడంతో వీడియో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత తల్లి విపరీతంగా తిట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. "ఓ ఉద్యోగం లేదు సదువు సంకనాకిస్తివి ఏ పనీ శాత కాద"ని వాళ్ల అమ్మ చెప్పే డైలాగ్స్ తిరువీర్ క్యారెక్టర్ ను ప్రస్ఫుటం చేస్తున్నాయి. దాంతో పాటు "ఏంది సత్తీ గిది.. నేను లిప్ లాసమ్ పట్కరమ్మన్న.. లిప్ లాసమ్ అంటే గిట్ల మూతికి పెట్టుకోంగనే చెక్కుమని మెరవాలే.. నాలెక్క. గిది సూడు పెదువులు పలిగితే పెట్టుకునే దానిలాగా ఉంది. నువ్వే పెట్టుకో నీ బర్రె మూతికి" అని అమ్మాయి చెప్పే డైలాగ్ మరింత అలరిస్తోంది. ఆ తర్వాత తిరువీర్ తో పాటు అతని స్నేహితుల లవ్ స్టోరీని చూపిస్తూ వచ్చే సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. అచ్చం పల్లెటూరి భాషలో రాబోతున్న ఈ కామెడీ సినిమా.. ప్రస్తుతానికైతే అందరిలోనూ అంచనాలను పెంచేస్తోంది. ప్రతి ఒక్కరూ తమ డైలాగ్ డెలివరీతో అందర్నీ ఆకట్టుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.



‘ఘాజీ’, ‘మల్లేశం’, ‘జార్జిరెడ్డి’, ‘పలాస’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తిరువీర్.. ఇటీవల ‘మసూద’ సినిమాలో హీరోగా నటించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా.. కాసువల వర్షం కురిపించింది. ఈ మూవీలో తిరువీర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ మూవీ తరవాత తిరువీర్ హీరోగా వస్తోన్న చిత్రం ‘పరేషాన్’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఫిబ్రవరిలో విడుదల చేశారు.


ఇక రానా దగ్గుబాటి ఈ సినిమాను ప్రకటించడం మూవీపై మరింత ఆసక్తి పెంచుతోంది. కంటెంట్ బాగుంటే కానీ రానా విడుదల చేయడానికి అంగీకరించరన్న విషయం చాలా మందికి తెలుసు. కాబట్టి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న‘పరేషాన్’ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం కలుగుతోందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సినిమాను స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మించారు. యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. పావని కరణం, బన్నీ అభిరాం, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుద్దరాఖాన్ రవి, రాజు బెడిగేలా ప్రధాన పాత్రలు పోషించారు.


Read Also : తారక్‌తో సమానంగా డ్యాన్స్ చేయడం చాలా కష్టం - ‘సింహాద్రి’ రోజులు గుర్తుచేసుకున్న నటి అంకిత