విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు సామాజిక స్పృహ ఎక్కువ. సమాజానికి ఏదైనా మంచి చేయాలనుకునే తపన ఆయనలో కనపడుతూ ఉంటుంది. కరోనా మహమ్మారి పంజా విసిరిన సమయంలో మధ్య తరగతి కుటుంబాలకు ఆయన నేరుగా సాయం చేశారు. ఇప్పుడు మరో మంచి పనికి ఆయన ముందుకు వచ్చారు. మరణించిన తర్వాత మరో నలుగురికి తన దేహం ఉపయోగపడే నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా మందికి స్ఫూర్తి ఇస్తుందని చెప్పవచ్చు.
అవయవాలన్నీ దానం చేస్తున్నా!
హైదరాబాద్‌లో ఓ ప్రయివేట్ ఆసుపత్రి నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన విజయ్ దేవరకొండ, తన అవయవాలు అన్నిటినీ దానం చేస్తున్నట్లు తెలిపారు. మరణించిన తర్వాత ఆర్గాన్స్ డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఆర్గాన్స్ డొనేషన్‌కు అందరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మద్దతుతో ప్రజలు తమ అవయవాలను దానం చేయడం వల్ల చాలా ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు జరుగుతున్నాయని, అయితే సౌత్ ఆసియాలో ఆశించిన విధంగా ప్రజలు ఆర్గాన్స్ డొనేట్ చేయడం లేదని ఆయన వివరించారు.
విజయ్ దేవరకొండ తల్లి కూడా!
విజయ్ దేవరకొండ మాత్రమే కాదు... ఆయన తల్లి మాధవి కూడా ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు తెలిపారు. ఆర్గాన్స్ డొనేట్ చేయాలనుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యమని ఆయన చెప్పారు.
Also Read : ట్విట్టర్‌లో రష్మిక ఫ్యాన్స్ వింత కోరిక - తెరపైకి కొత్త డిమాండ్
ఇటీవలే గాయాల నుంచి కోలుకున్న విజయ్ దేవరకొండ!
'లైగర్'లో విజయ్ దేవరకొండ కిక్ బాక్సర్, ఎంఎంఏ ఛాంపియన్ కావాలనుకునే వ్యక్తిగా కనిపించారు. రింగులో ఫైటింగ్స్ రియల్‌గా ఉండటం కోసం ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. కొన్ని రోజులు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆ సమయంలో ఆయన భుజానికి గాయం అయ్యింది. ఎనిమిది నెలల తర్వాత ఆ గాయం తగ్గింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ చెప్పారు.
''ఎనిమిది నెలల చికిత్స తర్వాత గాయం తగ్గింది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా? అని ఎదురు చూస్తున్నాను. చాలా రోజుల నుంచి ఇంటికి మాత్రమే పరిమితం అయ్యాను. ఇప్పుడు బయటకు వెళ్ళాలి. పని చేయాలి'' అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. జిమ్‌లో వర్కవుట్స్ ఎక్కువ చేయడం, వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల చేతి వేళ్ళకు అయిన గాయాలను ఆయన చూపించారు.
సినిమాల్లోకి రావడానికి ముందు కూడా విజయ్ దేవరకొండకు షోల్డర్ ఇంజ్యూరీ అయినట్టు ఆయన ట్రైనర్ కులదీప్ సేథీ తెలిపారు. 'లైగర్' షూటింగ్ చేస్తున్న సమయంలో మరోసారి ఆ గాయం తిరగబెట్టిందట. దాంతో విజయ్ దేవరకొండ చాలా కష్టపడాల్సి వచ్చిందని సమాచారం. అయితే... తన పోస్టులో విజయ్ దేవరకొండ ఎక్కడా 'లైగర్' పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చేస్తున్నారు. అందులో సమంత హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం బాలేకపోవడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా వేశారు.