విక్టరీ వెంకటేష్ హీరోగా 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి'... కింగ్ నాగార్జునతో 'మన్మథుడు', ఇంకా తరుణ్ హీరోగా నటించిన 'నువ్వే కావాలి' వంటి బ్లాక్ బస్టర్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ తీశారు విజయ్ భాస్కర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'ఉషా పరిణయం'. ఈ వారం ఓటీటీలోకి రానుంది.
ఈటీవీ విన్ యాప్... ఈ నెల 14న రిలీజ్
సీనియర్ దర్శకుడు విజయ్ భాస్కర్ (Vijay Bhaskar) తీసిన తాజా సినిమా 'ఉషా పరిణయం' (Usha Parinayam). ఆగస్టు 2న థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాను ఈటీవీ విన్ యాప్ డిజిటల్ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో ఆ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది (Usha Parinayam OTT Release Date).
ఇటీవల కాలంలో థియేటర్లలో విడుదలైన నెల, రెండు నెలలకు బడా స్టార్ హీరోస్ నటించిన సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. అయితే... విజయ్ భాస్కర్ తీసిన 'ఉషా పరిణయం' ఆల్మోస్ట్ మూడున్నర నెలలకు ఓటీటీలోకి వస్తుండటం విశేషం.
'ఉషా పరిణయం' చిత్రానికి 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్...' అనేది ఉప శీర్షిక. దీనిని విజయ్ భాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై దర్శకుడు కె. విజయ్ భాస్కర్ స్వయంగా నిర్మించారు. ఇందులో ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా నటించాడు. అతడి సరసన తెలుగు అమ్మాయి తాన్వీ ఆకాంక్ష నటించింది. నాయికగా ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఇందులో సీరత్ కపూర్ స్పెషల్ సాంగ్ చేసింది.
'ఉషా పరిణయం'తో ప్రేమకు తనదైన శైలిలో సరికొత్త నిర్వచనం ఇచ్చేందుకు దర్శకుడు విజయ్ భాస్కర్ ప్రయత్నించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. లవ్ స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీనిని కుటుంబం అంతా కలిసి చూడొచ్చు. థియేటర్లలో ఈ సినిమాకు అంత గొప్ప స్పందన ఏమీ రాలేదు. మరి, ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
శ్రీ కమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటించిన ఈ సినిమాలో సూర్య, రవి, శివతేజ, అలీ, 'వెన్నెల' కిషోర్, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: ఆర్ఆర్ ధ్రువన్, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల, కూర్పు: ఎమ్ఆర్ వర్మ, దర్శకత్వం - నిర్మాణం: కె. విజయ్ భాస్కర్.