Sasi Kumar's Tourist Family OTT Release On Jio Hotstar: తమిళ నటుడు శశికుమార్, సిమ్రన్ లేటెస్ట్ కామెడీ డ్రామా 'టూరిస్ట్ ఫ్యామిలీ'. కొత్త దర్శకుడు అభిషాన్ జీవింత్ తెరకెక్కించిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తమిళ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వచ్చింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రముఖ ఓటీటీ 'జియో హాట్‌స్టార్'లో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఓవర్సీస్ ఆడియన్స్ కోసం సింప్లీ సౌత్ ఓటీటీలోనూ అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాగా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ నెల 24న జపాన్‌లోనూ రిలీజ్ చేశారు. రూ.10 కోట్ల లోపు బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ దాదాపు రూ.75 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అభిషాన్‌కు ఇది ఫస్ట్ మూవీ కాగా అంతకు ముందు యూట్యూబర్.
రాజమౌళి మెచ్చిన మూవీ
ఈ మూవీని చూసిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. 'టూరిస్ట్ ఫ్యామిలీ అద్భుతమైన మూవీ. హృదయాన్ని కదిలిస్తూనే కడుపుబ్బా నవ్వించింది. అభిషాన్ గొప్పగా రచించి డైరెక్ట్ చేశారు. ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా.' అంటూ ట్వీట్ చేశారు. దీనిపై అభిషాన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయనతో పాటే నేచురల్ స్టార్ నాని.. కోలీవుడ్ హీరోలు రజనీకాంత్, సూర్య, శివకార్తికేయన్ కూడా ఈ సినిమాను ప్రశంసించారు.
స్టోరీ ఏంటంటే?
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ధర్మదాస్ అలియాస్ దాస్ (శశికుమార్), అతని భార్య వాసంతి (సిమ్రాన్) ఇద్దరూ కొడుకులతో కలిసి శ్రీలంక నుంచి అక్రమంగా భారత్‌కు వలస వస్తారు. వీరికి దాస్ బావమరిది సాయం చేస్తాడు. వీరి వివరాలు ఎవరికీ తెలియకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎవరితో మాట్లాడొద్దని.. ఏ విషయాలు చెప్పొద్దని కండిషన్లు పెడతాడు. అయితే.. దాస్ ఫ్యామిలీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో ఓ బాంబ్ బ్లాస్ట్‌కు దాస్ ఫ్యామిలీ కారణమని పోలీసులు అనుమానిస్తారు.
అసలు దాస్ ఫ్యామిలీ ఎందుకు భారత్‌కు రావాల్సి వచ్చింది?, వారి ప్రవర్తన వల్ల ఎదురైన చిక్కులేంటి?, బాంబ్ బ్లాస్ట్ వెనుక ఉన్నది ఎవరు?, చిక్కుల నుంతి దాస్ తన ఫ్యామిలీని కాపాడుకున్నాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ మేళవించి అద్బుతంగా మూవీని తెరకెక్కించారు అభిషాన్. సాదాసీదాగానే సగటు ఆడియన్స్ హార్ట్ టచ్ అయ్యేలా మూవీ కనెక్ట్ అయ్యింది.