నోజ్ బాజ్‌పాయ్.. ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సీరిస్ తప్పకుండా గుర్తుకొస్తుంది. ఆ సీరిస్‌కే కాదు.. మనోజ్ పాత్రకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంతగా ప్రేక్షకుల అభిమానం పొందిన మనోజ్ బాజ్‌పాయ్.. తాజాగా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ ‘జీ5’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే హిందీలో సూపర్ హిట్ సాధించిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మూవీ విశేషాలు, తన కెరీర్ గురించి చెప్పారు. 


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను చిన్న చిన్న పాత్రల కోసం తిరుగుతున్నప్పుడు నాలో టాలెంట్‌ను గుర్తించిన వ్యక్తి ఆర్జీవీ. ఆయనే నా మెంటర్. ఆయన్ని ఎప్పటికీ నేను మరిచిపోను’’ అని తెలిపారు. అలాగే, బాలీవుడ్‌లో ఈ రోజు కొత్త కొత్త నటీనటులతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తున్నాయంటే కారణం ఆర్జీవేయేనని అన్నారు. ‘సత్య’ మూవీ బాలీవుడ్ ఎంతోమందికి దారి చూపిందన్నారు. 


సింగిల్ టేక్‌లో ఏడు పేజీల డైలాగ్ చెప్పా: మనోజ్


మనోజ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై.. చిత్రం ఇంత పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని మేం ఎవ్వరం ముందుగా ఊహించ‌లేదు. ఓ మంచి సినిమాను చేయాల‌ని మేం భావనంతో మేమంతా ఎంతో కష్టపడి పనిచేశాం. ఈ సినిమా క్లైమాక్స్‌ ప్రేక్షకులకు చాలా నచ్చిందట. మా డైరెక్టర్ అపూర్వసింగ్ క‌ర్కి క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ కోసం మూడు నాలుగు కెమెరాలు పెట్టారు. సింగిల్ టేక్‌లో ఏడు పేజీలున్న మోనోలాగ్‌ను కంప్లీట్ చేయాల‌ని నాతో అన్నారు. అందుకు నాకు రెండు రోజుల స‌మయం కూడా ఇచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లుగానే సింగిల్ టేక్‌లో పూర్తి చేయాల‌నుకుని.. నేను వాటిని నేర్చుకుని.. బాగా ప్రాక్టీస్ చేసి చేశాను. ఇప్పుడు వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. 


‘‘ఈ చిత్రంలో నేను చేసిన సోలం అనే లాయ‌ర్ పాత్ర కామ‌న్ మ్యాన్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఎన్నో కష్టనష్టాలున్నప్పటికీ దాన్ని చిరున‌వ్వుతో ఎదుర్కొనే సాధార‌ణ మధ్యతరగతి ప్రజలందరికీ ఈ పాత్ర ఓ ఉదాహ‌ర‌ణ‌. సోలంకి పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. అందుక‌నే మంచి అప్రిషియేష‌న్స్ వ‌స్తున్నాయి. ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ కాన్సెప్ట్‌ను మ‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌లు నిజ ఘ‌ట‌న‌ల‌ల‌ను ఆధారంగా  త‌యారు చేశాం. ప్రధానంగా ఈ  సినిమా అంతా 16 ఏళ్ల అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది. ఆమె త‌న జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితులను ఇందులో చూపించాం’’ అని పేర్కొన్నారు. 


మహేష్ బాబుకైతే ఆ పాత్ర సూట్ అవుతుంది


‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ మూవీలో మీరు చేసిన పాత్రకు తెలుగులో ఎవరు సరిగ్గా సరిపోతారని మీరు బావిస్తున్నారనే ప్రశ్నకు మనోజ్ సమాధానమిస్తూ.. ‘‘ఇప్పటికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాయ‌ర్‌గా చేసి మెప్పించారు. మ‌హేష్ బాబు అయితే ఈ పాత్రకు సూట్ అవుతార‌నిపిస్తోంది’’ అని తెలిపారు. ఇటీవల మీరు చూసిన తెలుగు సినిమాలేంటనే ప్రశ్నకు మనోజ్ బదులిస్తూ.. ‘‘ఇటీవలే నేను ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చూశాను’’ అని తెలిపారు. హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు రాయ‌ల‌సీమ రుచులుకు వెళుతుంటాను. ఎందుకంటే నాకు స్పైసీ ఫుడ్ బాగా ఇష్టం. అలాగే బిర్యానీని కూడా ఇష్టంగా తింటాను’’ అని పేర్కొన్నారు.