Valari Trailer: 'రోజా పూలు' సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీరామ్.. గత దశాబ్ద కాలంగా తెలుగు తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. గతేడాది చివర్లో 'పిండం' అనే హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించిన నటుడు, ఇప్పుడు ‘వ‌ళ‌రి’ (Valari) అనే హారర్‌ మూవీతో భయపెట్టడానికి వస్తున్నారు. ఎం మృతిక సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీరామ్ తో పాటుగా ‘గురు’ ఫేమ్ రితికా సింగ్ మరో ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. దీనికి ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 


''వెంకటాపురం బంగ్లా డీటెయిల్స్ కావాలి'' అంటూ రితికా సింగ్ ఓ హాంటెడ్ హౌస్ గురించి వివరాలు సేకరిస్తుండటంతో ‘వ‌ళ‌రి’ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ బంగ్లా ఒక దెయ్యాల కొంప అని ఒక ముసలావిడ చెప్తే, ఆ ఇల్లు మూసేసి ఎన్నో ఏళ్లయిందని మరో వ్యక్తి చెప్తాడు. అక్కడి నుంచి ఈ ట్రైలర్ హారర్ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగింది. ''మనం ఒక పాపం చేసి ఆ తర్వాత మర్చిపోతే ఇంకా మనం పాపాత్ములమేనా?'' అని రితికా అడగడం చూస్తుంటే.. భర్త పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న ఆమెను తన గతం వెంటాడుతోందని అర్థమవుతుంది. 


రితికా గతంలో ముగ్గురు వ్యక్తులను చంపగా, వారి ఆత్మలే ఆమెపై పగ తీర్చుకోడానికి ట్రై చేస్తున్నట్లు ట్రైలర్ లో కనిపిస్తోంది. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె తన గతాన్ని మర్చిపోయినట్లుగా తెలుస్తోంది. 'హంతకురాలు ఆమె హత్యలను మరచిపోతే, చంపబడినవారు ఆమెను మరచిపోవాలా?' అని ట్రైలర్ ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే, సినిమా కథంతా ఇదే లైన్ మీద నడుస్తుందేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. 'ష్..దెయ్యం వస్తోంది' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ముగిసింది. అసలు ‘వ‌ళ‌రి’ అంటే ఏంటి? ఈ కథేంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. 






మనం ఏం చేసినా కర్మ తిరిగి మన వద్దకే వస్తుందనే పాయింట్ తో ‘వ‌ళ‌రి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శ్రీరామ్, రితికా సింగ్ భార్యాభర్తలుగా కనిపిస్తున్నారు. ఇద్దరూ తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. రితిక పాత్రలో వేరియేషన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఉత్తేజ్, సుబ్బరాజు, సహస్రా, పరిణీత రుద్రరాజు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ ట్రైలర్ సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించేలా ఉందని చెప్పాలి. మరి ఇది రితికా సింగ్, శ్రీరామ్ లకు తెలుగులో ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


‘వ‌ళ‌రి’ చిత్రాన్ని తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో మార్చి 6వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీఎస్ విష్ణు సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేసారు. కె సత్య సాయిబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. 


Also Read: దీపికా పదుకొణె ప్రెగ్నెంట్.. ఇప్పుడు ప్రభాస్ 'కల్కి' పరిస్థితి ఏంటి?