Squid Game Web Series Season 3 OTT Release On Netflix: క్రైమ్ థ్రిల్లర్స్ అంటేనే ఓ స్పెషల్ క్రేజ్. ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగానే ప్రముఖ ఓటీటీలన్నీ అలాంటి కంటెంట్‌నే అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా.. మరో హిట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ వివరాలు చూస్తే..
ప్రతీ క్షణం భయం భయం.. మనుషుల ప్రాణాలతో చెలగాటం. చిన్న పిల్లల్లా సరదాగా ఆటలు ఆడుతుంటారు. గెలిస్తే డబ్బులు.. ఓడిపోతే ప్రాణాలు.. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అదే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' (Squid Game). ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' (Netflix) వేదికగా రిలీజ్ అయిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంది. 2021లో విడుదలైన ఈ కొరియన్ థ్రిల్లర్ సిరీస్ ఫస్ట్ సీజన్ రికార్డులు సృష్టించడం సహా.. వివిధ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. ఆ జోష్‌తో గతేడాది చివర్లో రెండో సీజన్ రిలీజ్ చేయగా.. అంతే హైప్‌తో మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు తాజాగా మూడో సీజన్ రాబోతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సిరీస్ కొత్త సీజన్ జూన్ 27 నుంచి 'నెట్ ఫ్లిక్స్' వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మూడో సీజన్ టీజర్ సైతం రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. కొత్త సీజన్ రిలీజ్ అవుతుండడంతో సినీ ప్రియులు ఖుష్ అవుతున్నారు.
స్టోరీ ఏంటంటే?
అప్పుల్లో కూరుకుపోయిన.. కటిక పేదరికంలో ఉన్న పేదలను గుర్తించి వారితో ఆటలాడించి ఈ తతంగాన్ని డబ్బున్నోళ్లు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. 'గెలిస్తే డబ్బులు.. ఓడిపోతే ప్రాణాలు' ఇదే ప్రధానాంశంగా ఈ సిరీస్ రూపొందింది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జీవితంలో అన్నీ కోల్పోయిన 456 మందిని గుర్తించి ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ వంటివి కండక్ట్ చేస్తారు. మొత్తం 6 పోటీల్లో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ కరెన్సీ (రూ.332 కోట్లు) గిఫ్ట్‌గా అందుతుంది. గేమ్స్ సింపుల్‌గానే ఉన్నా ఓడిపోతే మాత్రం ప్రాణాలు తీసేస్తారు. ఫస్ట్ గేమ్ ఆడితేనే ఈ విషయం అందరికీ తెలుస్తుంది.
సీజన్ 2లో ఏం జరిగిందంటే?
షియెంగ్ జీ హున్ (లీ జంగ్ జే) 'స్క్విడ్ గేమ్' అన్ని దశలు పూర్తి చేసి.. 45.6 కొరియన్ వన్ గెలుచుకుంటాడు. అయితే, మనుషుల ప్రాణాలు తీసే ఈ ఆట వెనుక ఫ్రంట్ మ్యాన్ అనే వ్యక్తి ఉన్నాడని కనిపెట్టి.. ఈ గేమ్‌కు ముగింపు పలకాలని యత్నిస్తుంటాడు. ఈ గేమ్‌లోకి తీసుకెళ్లే వ్యక్తిని వెతకడం కోసం తాను గెలుచుకున్న డబ్బులను విపరీతంగా ఖర్చు చేస్తుంటాడు. ఇదే సమయంలో గేమ్‌లో గాయపడి బయటపడిన హ్వాంగ్ జున్ హో (వి హా జూన్) హున్‌కు సాయం చేయాలనుకుంటాడు. ఇద్దరూ కలిసి కష్టపడి ఫ్రంట్ మ్యాన్‌ను పట్టుకుంటారు. అక్కడితో ఈ సీజన్ ముగిసింది.
ఎలాగైనా ఈ ఆటకు పూర్తిగా అంతం పలకాలని భావించిన షియెంగ్ జీ హున్.. ఫ్రంట్ మ్యాన్‌ను అంతం చేశాడా? లేదా? అనేది సీజన్ 3లో చూపించనున్నారు. ఇదే చివరి సీజన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.