‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ కు ఫ్రెండ్ గా నటించిన జగదీష్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు ఈ తెలంగాణ కుర్రాడు. అంతకముందు ‘పలాస’ సినిమాలో ఉత్తరాంధ్ర యాసలో చక్కటి డైలాగులు చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘పుష్ప’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మరింత క్రేజ్ సంపాదించాడు. తాజాగా జగదీష్ హీరోగా ఒక సినిమా తెరకెక్కింది. అదే ‘సత్తి గాని రెండెకరాలు’. అభినవ్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ కాస్త ఇంట్రస్టింగ్ ఉండటంతో నెట్టింట వైరల్ అవుతోంది.  


ఇక ‘సత్తి గాని రెండెకరాలు’ టీజర్ విషయానికొస్తే.. టీజర్ ను చాలా ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు. సినిమాలో హీరో జగదీష్ ది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అయితే అనుకోకుండా తన బిడ్డకు గుండెకు సంబంధించిన సమస్య రావడంతో ఆ వైద్యం చేయించడానికి డబ్బులు కోసం తిరుగుతూ ఉంటాడు. తనకున్న ఆటో, రెండెకరాల పొలం అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇంతకీ పొలం అమ్ముకున్నాడా లేదా, మధ్యలో మర్డర్ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు, సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి, తనకు కావాల్సిన డబ్బు అందిందా లేదా, చివరికి తన బిడ్డకు వైద్యం చేయించాడా తన సమస్యల నుంచి ఎలా గట్టెక్కాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే. ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జగదీష్. మరి ఈ సినిమా జగదీష్ ను హీరోగా నిలబెడుతుందో లేదో చూడాలి. 


ప్రస్తుత రోజుల్లో హీరోగా సినిమా అవకాశాలు రావడం అంటే కొంచెం కష్టమే. అందులోనూ చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి వెంటనే హీరోగా చాన్స్ రావడం అంటే విశేషమే. అయితే జగదీష్ కు మాత్రం చాలా త్వరగానే హీరోగా అవకాశం లభించింది. ‘పుష్ప’ సినిమాలో జగదీష్ కు బలమైన పాత్రను ఇవ్వడం, ఆ పాత్రకు ఆయన సరైన న్యాయం చేయడంతో జగదీష్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతనికి సినిమా హీరోగా చాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలో విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అనే సందేహంతో మూవీను డైరెక్టుగా ఓటీటీ లో విడుదల చేయనున్నారు. మరో విశేషం ఏంటంటే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీను ఆహా ఓటీటీ తో కలసి సంయుక్తంగా నిర్మించారు. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. పరిమిత బడ్జెట్ తో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిన ఈ మూవీను ఆహా ఓటీటీ వేదికపై మార్చి 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. 


Also Read : 'కెజియఫ్' మీద కామెంట్స్‌పై వెనక్కి తగ్గని వెంకటేష్ మహా - మంట మీద పెట్రోల్ పోశారా?