Mirzapur 3 Bonus Episode: ‘మీర్జాపూర్’. ఇండియన్ ఓటీటీ చరిత్రలో అత్యధిక వ్యూస్ అందుకున్న వెబ్ సిరీస్ గా గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా రేంజిలో ఈ వెబ్ సిరీస్‌కు ఫాలోయింగ్ ఉంది. బోల్డ్ కంటెంట్, రాజకీయ ఎత్తులు, వాటిని చిత్తు చేసే పైఎత్తులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మోతాదుకు మించి బూతు మాటలు, బోల్డ్ సన్నివేశాలు, రక్తపాతం ఉందనే విమర్శలు వచ్చినా, ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఇప్పటి వరకు మూడు సీజన్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకదానిని మించి మరొకటి హిట్ అయ్యాయి.


మున్నా భయ్యా లేకపోవడంతో ప్రేక్షకుల నిరాశ


ఇక రీసెంట్ గా విడుదలైన ‘మీర్జాపూర్’ సీజన్ 3లో మున్నాభాయ్ క్యారెక్టర్ కనిపించలేదు. గత రెండు సీజన్లలో బాగా ఆకట్టుకున్న మున్నాభాయ్ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. అంతేకాదు, ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో జోష్ అందివ్వలేకపోయింది. నిజానికి రెండో సీజన్ లో మున్నాభాయ్ చనిపోయినట్లు చూపిస్తారు. దాన్ని కవర్ చేసేందుకు మూడో సీజన్ బోలెడన్ని ట్విస్టులు ఇచ్చారు మేకర్సర్. మున్నాభాయ్ లేనిలోటు మాత్రం ప్రేక్షకులకు రుచించలేదు. ఈ విషయాన్ని గుర్తించిన మేకర్స్.. ప్రేక్షకులలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ‘మీర్జాపూర్’ సీజన్ 3 బోనస్ ఎపిసోడ్ పేరుతో ఓ ఎపిసోడ్ ను తీసుకురాబోతున్నారు. ఇవాళ్టి(ఆగస్టు 30) నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.


బోనస్ ఎపిసోడ్ టీజర్ రిలీజ్


‘మీర్జాపూర్’ సీజన్ 3 బోనస్ ఎపిసోడ్ కు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. “మనం ఏది సరిగ్గా చేయమని చేశాక ఆలోచిస్తాం” అంటూ మున్నాభాయ్  ఇందులో చెప్పడం కనిపిస్తుంది. “నా నిష్క్రమణ చాలా సంచలనం కలిగించింది. మమ్మల్ని ఇష్టపడే అభిమానులు నన్ను చాలా మిస్ అవుతున్నారని విన్నాను. నిజంగా, నేను కూడా  మీ అందరినీ కూడా మిస్ అయ్యాను. మీ మద్దుతు మాకు ఎంతో ముఖ్యమైనది. మనం ఏది సరిగ్గా చేయం. ఆ విషయాన్ని చేశాక ఆలోచిస్తాం” అని ప్రోమోలో వెల్లడించారు. మొత్తంగా ‘మీర్జాపూర్’ సీజన్ 3 బోనస్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోబోతున్నట్లు అర్థం అవుతోంది.



‘మీర్జాపూర్’ సీజన్ 4వ సీజన్ లో మున్నాభాయ్ ఉంటారా?


తాజాగా ప్రోమోను బట్టి చూస్తే నాలుగో సీజన్ లో మున్నాభాయ్ కనిపించబోతున్నట్లు అర్థం అవుతోంది. గత కొద్ది రోజులుగా సీజన్ 4లో మున్నాభాయ్ ఉంటాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ, 2వ సీజన్ లో చనిపోయిన మున్నాభాయ్ 4వ సీజన్ లో ఎలా తిరిగి వస్తాడనేది ఆసక్తికరంగా మారింది.   


ఇక ఈ సంచలన వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ను కరణ్ అన్షూమాన్, పునీత్ కృష్ణ తెరకెక్కించారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి, ఇషా తల్వార్ సహా పలువు కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ కు ఆనంద్ భాస్కర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు.  ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్ యాక్షన్ సిరీస్‌ కు ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా వ్యవహరించారు.



Read Also: ‘మీర్జాపూర్ 4‘ చివరి సీజన్ కానుందా? ఈ సీజన్ రిలీజ్ అయ్యేది అప్పుడేనా?