Feel Good Movies On OTT: సోషల్ మెసేజ్‌ కథతో వచ్చి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే కథలు చాలా అరుదు. అందులోనూ ఈరోజుల్లో యూత్‌కు నచ్చేలా సోషల్ మెసేజ్ సినిమాలు రావడం చాలావరకు తగ్గిపోయింది. కానీ తాజాగా ఓటీటీలో విడుదలయిన ఒక ఆంథలజీ మూవీకి మాత్రం ప్రేక్షకుల దగ్గర నుంచి ముఖ్యంగా యూత్ దగ్గర నుండే ప్రశంసలు వస్తున్నాయి. ఆ మూవీ పేరే ‘హాట్ స్పాట్’ (Hot Spot). యూత్‌ఫుల్ డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఒకటి కాదు.. రెండు కాదు.. మొత్తం అయిదు కథలు ఉంటాయి. ప్రతీ కథ చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది.


కథ..


మహమ్మద్ (విఘ్నేష్ కార్తిక్).. డైరెక్టర్ అవ్వాలని కలలు కంటాడు. అదే క్రమంలో ఒక నిర్మాతకు కథ చెప్పడానికి వస్తాడు. ఎన్ని కథలు చెప్పినా నిర్మాతకు నచ్చదు. ఫైనల్‌గా తన దగ్గర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథలు.. ఒకటి కాదు నాలుగు ఉన్నాయని చెప్తాడు. అలా ఒక్కొక్కటిగా నిర్మాతకు కథలు చెప్పడం మొదలుపెడతాడు. మొదటి కథ.. ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’. విజయ్ (ఆదిత్య భాస్కర్), ధన్య (గౌరీ జీ కిషన్) ప్రేమించి పెద్దలను ఒప్పిస్తారు. అలా రెండు కుటుంబాలు కలవడానికి ఒప్పుకుంటాయి. కానీ కథ అంతా కాస్త రివర్స్‌లో జరుగుతుంది. ధన్య.. విజయ్ మెడలో తాళి కడుతుంది. విజయ్.. తన తల్లిదండ్రులను వదిలేసి ధన్య ఇంటికి వెళ్తాడు. అక్కడ అంతా ఆడవారే.. మగవారిపై పెత్తనం చూపిస్తారు. అసలు ఎందుకిలా జరుగుతుంది అనేది తెరపై చూడాల్సిందే.


రెండో కథ.. ‘గోల్డెన్ రూల్స్’. సిద్ధార్థ్ (సాండీ), దీప్తి (అమ్ము అభిరామి) ప్రేమించుకుంటారు. సాండీ తల్లిదండ్రులు తమ పెళ్లికి కూడా ఒప్పుకుంటారు. కానీ దీప్తి తన తల్లిదండ్రులను ఒప్పించడం కోసం తానొక లెస్బియన్ అని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత తాను లెస్బియన్ కాదని, వేరొక కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించానని నిజం చెప్తుంది. దీంతో తన తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయితో పెళ్లికి అడ్డుచెప్పరు. అంతా బాగుంది అనుకునేలోపు అనుకోకుండా వచ్చే ట్విస్ట్.. వారిద్దరూ ఆత్మహత్య చేసుకునేవరకు దారితీస్తుంది. ఎందుకలా జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలి.


మూడో కథ.. ‘తక్కాళి చట్నీ’. అనిత (జనని), వెట్రీ (సుభాష్) ప్రేమించుకుంటూ ఉంటారు. అనిత ఒక జర్నలిస్ట్. కానీ పలు కారణాల వల్ల సుభాష్ ఉద్యోగం పోతుంది. ఆ విషయం అనితకు చెప్పకుండా ఎలాగైనా వేరే ఉద్యోగంలో చేరాలని అనుకుంటాడు. అదే సమయంలో తనకు వేశ్యగా ఉండడానికి ఆఫర్ వస్తుంది. డబ్బు వస్తుండడంతో అదే పనిలో సెటిల్ అయిపోతాడు సుభాష్. ఒకరోజు అనుకోకుండా తను ఇలాంటి పనిచేస్తున్నాడన్న విషయం అనితకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెరపై చూడాల్సిన కథ.


నాలుగో కథ.. ‘ఫేమ్ గేమ్’. లక్ష్మి (సోఫియా).. తన భర్త ఎరుమలయ్ (కలయరాసన్)కు ఇష్టం లేకపోయినా కూతురిని చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తుంది. తన వల్లే ఆ కుటుంబం అంతా పేదరికం నుంచి బయటపడతారు. కానీ తన కూతురిని రేప్ చేసి చంపేస్తారు. దాని వల్ల వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. ఇక ఈ కథలు విన్న తర్వాత నిర్మాత ఒప్పుకున్నాడా లేదా అని పూర్తిగా సినిమా చూస్తేనే తెలుస్తుంది.


చిన్న కథలు.. పెద్ద సందేశం



‘హాట్ స్పాట్’లో నాలుగు కథలు ఉన్నా వాటి నిడివి చాలా తక్కువగా ఉండడంతో అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. పైగా ప్రతీ స్టోరీకి ఒక ఇంట్రెస్టింగ్ ఎండింగ్ ఇవ్వడంలో విఘ్నేష్ కార్తిక్ సక్సెస్ అయ్యాడు. ఈ నాలుగు కథలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మరో కథ నడుస్తుందనే విషయం ప్రేక్షకులు అస్సలు ఊహించలేరు. అలా పలు ట్విస్టులు, సోషల్ మెసేజ్‌తో ఉన్న ‘హాట్ స్పాట్’ను తమిళంలో చూడాలంటే అమెజాన్ ప్రైమ్‌లో, తెలుగులో చూడాలంటే ‘ఆహా’లో అందుబాటులో ఉంది.


Also Read: గతం మరిచిన మహిళ, తానే భర్తనంటూ సైకో సంసారం - ఇందులో థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి గురూ.. ఫిదా అయిపోతారు