Samantha Upcoming Web Series: ఈరోజుల్లో సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో వెబ్ సిరీస్‌లకు కూడా అంతే సమానంగా ప్రాధాన్యత లభిస్తోంది. సినిమాలతో సమానంగా బడ్జెట్‌ను కేటాయిస్తూ స్టార్ యాక్టర్లతో తెరకెక్కించిన అనేక వెబ్ సిరీస్‌లు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు సమంత కూడా అదే తోవలో వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సమంత.. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. తను ఇప్పటివరకు హిందీలో ఒక్క సినిమా కూడా చేయకపోయినా ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తోనే అక్కడ విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు తాజాగా మరో వెబ్ సిరీస్‌కు సిద్ధమయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


హ్యాట్రిక్ కాంబో..


రాజ్ అండ్ డీకే దర్శకులు సమంతకు మంచి ఫ్రెండ్స్. అందుకే వారు చెప్పిన కథ నచ్చి ‘ఫ్యామిలీ మ్యాన్ 2’లో డీ గ్లామర్‌గా విలన్ పాత్రలో నటించడానికి ఒప్పుకుంది సామ్. ఇప్పుడు మరోసారి వారి దర్శకత్వంలోనే ‘సిటాడెల్’ ఇండియన్ వర్షన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కూడా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవ్వడంతో మరోసారి రాజ్ అండ్ డీకేతో కలిసి మరో వెబ్ సిరీస్‌లో నటించడానికి సిద్ధమయ్యిందట సామ్. కానీ ఈసారి వారు దర్శకులుగా కాకుండా నిర్మాతలుగా వ్యవహరించనున్నారట. ప్రస్తుతం సమంత, రాజ్ అండ్ డీకే కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ హ్యాట్రిక్ వెబ్ సిరీస్ గురించి బాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. 


సరికొత్త కథ..


ఈ వెబ్ సిరీస్‌లో సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి కూడా కీలక పాత్రలు పోషించనున్నట్టు సమాచారం. దీనికి ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వి దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది. అందుకే ఇతర వివరాలను కూడా నెట్‌ఫ్లిక్సే స్వయంగా వెల్లడించనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు ‘రక్త్ బ్రహ్మండ్’ అనే టైటిల్‌ను పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశంతో ‘రక్త్’ తెరకెక్కనుందట. మోసం, నమ్మక ద్రోహం, ప్రేమ, త్యాగం వంటి అంశాలపై ఈ వెబ్ సిరీస్ సాగనుందని సమాచారం. ఒక పీరియాడిక్ ఫ్యాంటసీ సిరీస్‌గా ఇది తెరకెక్కనుందట.


అందరికీ ఎక్స్‌పీరియన్స్..


సమంత మాత్రమే కాదు ఆదిత్య రాయ్ కపూర్‌కు కూడా ఇంతకు ముందు వెబ్ సిరీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. తను ‘ది నైట్ మ్యానేజర్’ అనే సిరీస్‌లో హీరోగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఈ సిరీస్.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. వామికా గబ్బి అయితే వెబ్ సిరీస్‌లతోనే బాలీవుడ్‌లో ఒక మార్క్‌ను క్రియేట్ చేసింది. దాదాపు పాపులర్ అయిన ప్రతీ వెబ్ సిరీస్‌లో వామికా కనిపిస్తుంది. అలా ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక సరికొత్త వెబ్ సిరీస్‌లో నటించనున్నారనే వార్త ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది. ఇక రాజ్ అండ్ డీకే విషయానికొస్తే.. ఇప్పటికే వీరు‘ఫ్యామిలీ మ్యాన్ 3’ కథతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత సరికొత్త వెబ్ సిరీస్‌పై దృష్టిపెట్టనున్నారు.



Also Read: మరో హర్రర్ థ్రిల్లర్‌తో వస్తోన్న అవికా గోర్ - నేరుగా ఓటీటీలోనే రిలీజ్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?