కరోనా లాక్ డౌన్ అనంతరం దేశంలో ఓటీటీల ప్రభావం బాగా పెరిగింది. వీటి వినియోగం కూడా రోజు రోజుకు మరింత విస్తృతం అవుతోంది. చాలా మంది సినిమాలు, వెబ్ సిరీస్ లు సహా పలు షోలను చూసేందుకు  OTT ప్లాట్‌ఫారమ్‌లనే ఆశ్రయిస్తున్నారు. కొత్త సినిమాలు సైతం మూడ, నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి విడుదల చేయడంతో సినీ లవర్స్ కూడా ఓటీటీలనే వినియోగిస్తున్నారు.


ఇకపై ఓటీటీల్లోనూ పొగాకు వ్యతిరేక యాడ్స్ ప్లే చేయాల్సిందే!


తాజాగా ఓటీటీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమా థియేటర్లు, టీవీల మాదిరిగానే ఓటీటీల్లో పొగాకు వ్యతిరేక యాడ్స్  ప్లే చేయాలని వెల్లడించింది. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారమయ్యే వెబ్ సిరీస్‌లు, సినిమాలకు ముందు ఇప్పటి వరకు ఎలాంటి పొగాకు వ్యతిరేక యాడ్స్ ఉండేవి కాదు. నేరుగా సినిమాలను ప్రదర్శించేవారు. అయితే, ఇలా చేయడం  సిగరెట్లు,  పొగాకు ఉత్పత్తుల చట్టం 2003ని ఉల్లంఘించడం అవుతుందని కేంద్రం వెల్లడించింది.  


ఇకపై ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా కచ్చితంగా థియేట్రికల్ సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రాముల మాదిరిగానే పొగాకు వ్యతిరేక యాడ్స్ ప్లే చేయడం తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్ కంటెంట్‌ టెలీకాస్ట్ చేసే సమయంలో ఆయా  ప్రోగ్రామ్ ప్రారంభంతో పాటు మధ్యలో కనీసం 30 సెకన్ల పాటు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుందని ఈ ఉత్వర్వుల్లో కేంద్ర ప్రకటించింది. పొగాకు  దుష్ప్రభావాలపై కనీసం 20 సెకన్ల ఆడియో-విజువల్ డిస్‌క్లైమర్‌ను ప్రోగ్రామ్ ప్రారంభంలో, మధ్యలో చూపించాలని ఆదేశించింది. మన దేశంలోని పిల్లలు, యువతలో పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించడంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు ముఖ్యమైన పాత్ర పోషించేలా ఉన్నాయని, అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.


పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కీలక నిర్ణయం


వాస్తవానికి ఇవాళ(మే 31) ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన  సభ్య దేశాలు 1987లో ప్రపంచ హెల్త్ అసెంబ్లీ డబ్లూహెచ్ఎ 40.38 తీర్మానాన్ని ఆమోదించింది. ఏప్రిల్ 7, 1988ని ప్రపంచ ధూమపాన నిరోధక దినంగా పాటించాలని పిలుపునివ్వడం జరిగింది. పొగాకు అంటే సిగరెట్లు, చుట్టలు, బీడీలే కాదు. గుట్కా, ఖైనీ, జర్దా వంటివి కూడా ఇందులో భాగమే. ఇవి కూడా పొగాకు కిందకే వస్తాయి. వీటి వినియోగం కారణంగా శరీరంలోని సున్నితమైన అవయవాల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. పొగాకులోని నికొటిన్ ప్రజలను బానిసలుగా మార్చుతుంది. పొగాకు తాగటం వల్ల ఊపిరితిత్తులు, గుండె జబ్బులు సహా పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  రోజు సిగరెట్లు తాగే వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  పొగ తాగినప్పుడు మన శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ విడుల అవుతుంది. ఇది ఒక్కసారిగా రక్తం గడ్డలు కట్టేలా చేస్తుంది. పొగ తాగే వారి జీవిత కాల పరిమితిని గణనీయంగా తగ్గిస్తోంది.


Read Also: నెట్‌ఫ్లిక్స్, డిస్నీ‌ల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌‌తో పిచ్చెక్కించేస్తారట!