Game Of Thrones, The Last Of Us వెబ్ సీరిస్‌లు చూశారా? ఇంకా చూడకపోతే ఇప్పుడే మొదలుపెట్టండి. ఎందుకంటే.. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో ఇకపై HBO కంటెంట్ కనిపించదట.

 

ఇండియాలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌’ ఓటీటీ పలు హాలీవుడ్‌ సినిమాలను, సిరీస్‌లను స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. వాటిలో చాలా వరకు HBO కంటెంట్ ఉంటుంది. చాలా సంవత్సరాలుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌, HBO  మధ్య ఉన్న ఒప్పందం కొనసాగుతూ వస్తోంది. ఆ ఒప్పందం కారణంగా HBO నెట్ వర్క్‌ కంటెంట్‌ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఒప్పందంను రెన్యూవల్‌ చేసుకుంటూ కంటెంట్‌ను కొనసాగిస్తున్నారు. కానీ ఈసారి ఆ ఒప్పందం రెన్యూవల్‌ కాలేదట. దీంతో మార్చి 31 తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ లో ఉండే HBO కంటెంట్‌ ను పూర్తిగా తొలగిస్తున్నారట.

 

ఒక వేళ మీరు ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‌’ (Game of Thrones), ‘ది లాస్ట్ ఆఫ్ అజ్’ (The Last Of Us).. వంటి పాపులర్ వెబ్ సీరిస్‌లను ఇంకా చూడనట్లయితే ఇప్పుడే చూసేయండని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హింట్ ఇచ్చింది. HBO తో ఒప్పందం రద్దు చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఆ స్థానంలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు మరింత ఆసక్తికర కంటెంట్‌‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. 



ఇండియాలోకి HBO Max


HBO Max ఓటీటీ ప్రస్తుతం అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో అందుబాటులో ఉంది. ఇండియాలోకి కూడా HBO మ్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఓటీటీగా HBO మాక్స్ నిలిచింది. సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు దాదాపుగా రూ.1,300 చెల్లించాల్సి ఉంటుందట. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ నుంచి HBO కంటెంట్‌ తీసేయడం వల్ల సబ్‌ స్క్రైబర్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా. ఈ లోపే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రత్యామ్నాయం చూస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరో వైపు ఇండియాలో అత్యధిక హాలీవుడ్ కంటెంట్ ఇచ్చే ఓటీటీ లుగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు ఉన్నాయి. 

 


 

ఒకప్పుడు సినీ రంగానికి టీవీ చానెళ్లు గట్టిపోటీ ఇస్తున్నాయని, టీవీ సీరియల్స్ వల్ల థియేటర్లకు ఎవరూ రావడం లేదని గగ్గోలు పెట్టేవారు. అయితే, జనాలకు సీరియల్స్ ముఖం మొత్తేయడం వల్ల మళ్లీ థియేటర్లకు కళ వచ్చింది. అయితే, కరోనా వైరస్ వల్ల ప్రజల ఫోకస్ ఓటీటీలపై పడింది. ముఖ్యంగా వెబ్ సీరిస్‌లను చూసేందుకు అలవాటుపడ్డారు. దీంతో సినీ రంగానికి ఇదో పెద్ద ఛాలెంజ్‌గా మారింది. అయితే, నటీనటులు, దర్శక  నిర్మాతలు ఓటీటీలను సైతం సొమ్ము చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఓటీటీల వల్ల ప్రధానంగా నష్టపోతున్నది థియేటర్ యాజమాన్యాలే.